మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీచేసిన తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ తరపున పోటీచేసిన చాలామంది ప్రముఖులు గెలవటం, పార్టీ అధికారంలోకి వచ్చి తన బద్ధి విరోధి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని జగ్గారెడ్డి తట్టుకోలేకపోతున్నట్లున్నారు. తాను ఓడిపోవటం ఒకఎత్తయితే పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రవ్వటం మరో ఎత్తుగా మారింది. దీన్నే జగ్గారెడ్డి ఏమాత్రం సహించలేకపోతున్నారు. అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమి మాట్లాడుతున్నారో కూడా చూసుకోవటంలేదు.
ఇంతకీ జగ్గన్న ఏమన్నారంటే ప్రజలు తనను సంగారెడ్డిలో రెజెక్టు చేయటం కాదట తానే ప్రజలను రెజెక్టు చేస్తున్నట్లు ప్రకటించారు. సంగారెడ్డిలో ఎప్పటికీ పోటీచేయబోనని భీకర ప్రతిజ్ఞ కూడా చేశారు. తనను ఓడించేందుకు ప్రత్యర్ధులు రు. 60 కోట్లు ఖర్చు చేసినట్లు మండిపడ్డారు. ఇకపై తన సేవలన్నీ పార్టీ బలోపేతానికే ఉపయోగించబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ గెలుస్తుందని, రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను మంత్రి అవుతానని ముందే తెలుసన్నారు.
అయితే జగ్గారెడ్డి అంచనాల్లో మొదటిరెండు వాస్తవం అయ్యింది కానీ చివరది మాత్రం జరగలేదు. దాన్నే ఇపుడు ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఓడించేందుకు మిగిలిన వాళ్ళంతా ప్రయత్నించటం మామూలే కదా. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు, హరీష్ రావు 60 కోట్ల రూపాయలు ఖర్చుచేశారని గోల చేయటం అర్ధంలేదు. కామారెడ్డిలో పోటీచేసిన కేసీయారే స్వయంగా ఓడిపోయినపుడు ఇక జగ్గారెడ్డి ఓటమి ఎంత ? ఎవరు గెలవాలి ? ఎవరు ఓడాలన్నది నిర్ణయించేది ప్రజలే కాని ప్రత్యర్ధులు కారని జగ్గారెడ్డి ఇంకా తెలుసుకోలేదు. పైగా ఇకపై తాను పోటీచేయబోనని ప్రకటించటం మరీ విడ్డూరంగా ఉంది. అదేదో సామెతలో చెప్పినట్లుగా ‘చెరువు మీద అలిగితే’…. ఏమవుతుంది ? ఇపుడు జగ్గారెడ్డికి అనుభవంలోకి వస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates