వంగవీటి రంగా ఎవరి వాడు.. ఆయనను ఓన్ చేసుకునేందుకు కాంగ్రెస్, జనసేనలు ప్రయత్నిస్తున్న దరిమిలా.. ఇదే చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా జరిగిన రంగా వర్ధంతిని విజయ వాడ సహా గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిర్వహించా రు. దాదాపు రంగా చనిపోయిన తర్వాత.. 15 ఏళ్లపాటు కాంగ్రెస్ రంగాను మరిచిపోయిందనే చెప్పాలి.
రాధా 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడంతో ఆ పార్టీ కూడా రంగాను దాదాపు మరిచిపోయింది. అప్పటి నుంచి రంగా వర్ధంతులను, జయంతులను కాంగ్రెస్ తరఫున చేసిన వారు ఎవరూ లేరు. అయితే .. అనూహ్యంగా ఇప్పుడు వంగవీటి రంగాను కాంగ్రెస్ నాయకులు ఓన్ చేసుకున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. గుంటూరు, విజయవాడల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రంగా విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
అంతేకాదు.. రంగా భౌతికంగా ఉండి ఉంటే.. ఆయన కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉండేదని వ్యాఖ్యానించా రు. రంగాకు టుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. రంగా అభిమానులు కూడా కాంగ్రెస్‌లోకి రావాలని సూచించారు. మొత్తంగా రంగా అనుచరుల వైపు కాంగ్రెస్ అడుగులు జోరుగానే పడుతున్నాయి. ఇక, జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ కూడా రంగా వైపు చూస్తోంది.
రంగా వర్ధంతిని పురస్కరించుకుని తెనాలిలో రంగా విగ్రహానికి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు. రంగా అభిమానులుగా.. తాము ఆయనను అనుసరిస్తామని చెప్పారు. దీంతో రంగా వైపు.. జనసేన చూస్తోందన్నది స్పష్టంగా తేలి పోయింది ఇక, రంగా కుమారుడు రాధా నిర్వహించిన వర్ధంతి కార్యక్రమం(కాశీలో)లో ఏకంగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఇలా.. రంగా చుట్టూ రాజకీయాలు ఎన్నికలకు ముందు మరింత వేడెక్కడం గమనార్హం. మరి చివరకు రంగా ఎవరి వాడిగా మిగులుతాడో చూడాలి.