వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు తగ్గాలని పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. అదేంటీ పార్టీ విజయం కోసం రెచ్చిపోయి పని చేయాలని చెప్పాలే కానీ తగ్గమని చెప్పడమేంటని అనుకుంటున్నారు. దీని వెనుక బాబు వ్యూహం ఉంది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడం కోసం అధికార వైసీపీ సహా ఇతర పార్టీల నుంచి ఎవరొచ్చినా సరే కండువా కప్పేయాల్సిందేనని బాబు చూస్తున్నారు. మరి ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చూసి సొంత పార్టీ నేతలు తట్టుకోలేరన్నది జగమెరిగిన సత్యం. అందుకే ముందుగానే సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను బాబు దారిలోకి తెస్తున్నారు.
ఇటీవల అధికార పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. ఈ చేరికలతో బాబులో కొత్త జోష్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమనే ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసే ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారని బాబు భావిస్తున్నారు. అందుకే ఎవరొచ్చినా చేర్చుకుందామని సొంత పార్టీ నాయకులకు సూచిస్తున్నారు. తాజాగా వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
చేరికల సంగతి సరే మరి వైసీపీ నుంచి వచ్చే కీలక నేతలకు సీట్ల సర్దుబాటు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో వర్గ పోరు తప్పదనే అంచనాలు కలుగుతున్నాయి. ఈ సంగతి బాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడికి తెలియంది కాదు. అందుకే ముందుగానే బాబు జాగ్రత్తపడుతున్నారు. ఎవరొస్తే వారిని తీసుకుందామని, వాళ్లు తమకు అడ్డు అవుతారని టీడీపీ నాయకులు భావించకూడదని బాబు చెబుతున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక మెట్టు తగ్గి కలిసి పనిచేద్దామని సూచించారు. నిజమైన కార్యకర్తల త్యాగాలకు రుణం తీర్చుకుంటామని, ఇందులో సందేహాలు అక్కర్లేదని కూడా బాబు చెప్పారు. కానీ రేప్పొద్దున వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు సీట్లు త్యాగం చేయాల్సి వస్తే అప్పుడు టీడీపీ నేతలు ఒప్పుకుంటారా? సైలెంట్ గా బాబు చెప్పినట్లు చేస్తారా? అన్నది చూడాలి.