పేకాట పుణ్యం.. 24 మందికి క‌రోనా

సూర్యా పేట‌లో క‌రోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెర‌గ‌డానికి ఓ మ‌హిళ కార‌ణం కావ‌డం.. ఆమెకు అష్టాచెమ్మా ఆడే అలవాటు ఉండ‌టం వ‌ల్ల 30 మందికి పైగా క‌రోనా బారిన ప‌డ‌టం తెలిసిన సంగ‌తే. సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న త‌ర్వాత తాజాగా విజ‌య‌వాడ‌లో ఓ వ్య‌క్తి స‌ర‌దా 24 మందిని క‌రోనా బారిన ప‌డేలా చేసింది. ఓ వ్య‌క్తి లాక్ డౌన్ టైంలో క‌రోనా అంటించుకుని.. పేకాట ఆడ‌టం వ‌ల్ల ఇంత‌మంది క‌రోనా వ్యాధిగ్ర‌స్థులు కావ‌డానికి కార‌ణ‌మైంద‌ని స్వ‌యంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. విజ‌య‌వాడ‌లోని కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని ఆయ‌న వివ‌రించారు.

కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచిన ఆ వ్య‌క్తి పేకాట ఆడాడని.. వాళ్లంద‌రికీ అత‌డి నుంచి క‌రోనా సోకింద‌ని.. ఆ వ్య‌క్తులు వెళ్లి త‌మ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా అంటించార‌ని.. మొత్తంగా ఈ ఛైన్లో 24 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని కలెక్టర్‌ తెలిపారు. విజ‌య‌వాడ‌లోనే కార్మికనగర్‌లో మరో లారీ డ్రైవర్ ఇలాగే నిర్లక్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల 15 మందికి కరోనా సోకిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఇలా 40 మంది దాకా క‌రోనా బారిన ప‌డ్డార‌ని.. ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డాల‌ని క‌లెక్టర్ హెచ్చ‌రించారు. విజ‌య‌వాడలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌టం.. రెడ్ జోన్‌గా మార‌డంతో అక్క‌డ అనేక ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఆదివారం నాడు నగరంలో చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్‌ మూసివేస్తున్నట్టు అధికారులు ప్ర‌క‌టించారు.