ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ యశస్వి.. ఉరఫ్ యాష్ పొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు ఈ రోజు తెల్లవారు జామున అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. వదిలి పెట్టారు. వచ్చే నెల 11 వ తేదీన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి.. విచారణకు సహకరించాలని కోరారు. వాస్తవానికి యాష్ ను అరెస్టు చేశారన్న వార్త ఏపీలో సంచలనం రేపింది. యాష్ అరెస్టు ను ఖండిస్తూ.. టీడీపీ నాయకులు ప్రకటనలు కూడా చేశారు.
ఏం జరిగింది?
ఎన్నారై అయిన యాష్.. ఏపీలో జగన్ పాలనపై తరచుగా విమర్శలు గుప్పించేవారు. జగన్‌ను ఉగ్రవాదితో పోల్చి.. వారిలాగానే జగన్ ఆలోచనలు కూడా ఉంటాయని.. ఉగ్రవాదులకు జగన్‌కు పెద్దగా తేడా ఏమీలేదని కూడా వ్యాఖ్యానించి సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు.. జగన్ తన తండ్రిని చంపేసి సీఎం అవ్వాలని భావించాడని.. తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే సీఐడీ పోలీసులు కొన్నాళ్ల కిందట కేసులు నమోదు చేశారు.
ఇక, తాజాగా యష్.. విదేశాల నుంచి తిరిగి రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అనంతరం.. ఆయనను 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విడిచి పెట్టారు. ఇక, యాష్ అరెస్టుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. యాష్ అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులని.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలకు వేధింపులని మండిపడ్డారు.
అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందన్నారు. ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యులైన యాష్‌ను అరెస్టు చేయడం సైకోయిజానికి నిదర్శనమన్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని యాష్ పరామర్శించడం నేరమా అని ప్రశ్నించారు. యాష్ భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు జగన్ మోహన్ రెడ్డి తీరును ఖండించాలని అచ్చెన్నాయుడు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates