సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేరు రాష్ట్ర రాజకీయాలలో కొంతకాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక, వైసీపీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చినట్లు పుకార్ల వ్యాపించాయి. అయితే, విశాఖ ప్రజలు తనను అభిమానిస్తున్నారని, ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతానని ఆయన గతంలో ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఆ పుకార్లకు చెక్ పెడుతూ తాజాగా జేడీ లక్ష్మీనారాయణ సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీ పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని అన్నారు. ఐపీఎస్ కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రజా సేవకు వచ్చానని, ప్రజలను కలిసి వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని అన్నారు. అయితే, ప్రజా సేవ చేయాలంటే రాజ్యాధికారం ముఖ్యమని గుర్తించానని, ఆ రకంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి 3 లక్షల మంది ఓటర్లు మద్దతు సంపాదించానని చెప్పారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజలందరికీ తెలుసని, రాజకీయాలంటే మోసగించడం కాదు…సుపరిపాలన అని చెప్పేందుకే ఈ పార్టీ పెట్టానని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఏ పార్టీ మాట్లాడడం లేదని, హోదా వచ్చుంటే రాష్ట్రంలో ఇంత నిరుద్యోగం ఉండేది కాదని అన్నారు.ఒకరు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నారని, మరొకరు కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని అన్నారని, ఇంకొకరు తలలు తెగిపడినా పోరాడతామని ఇంకొకరు అన్నారని చంద్రబాబు, జగన్, పవన్ లపై షాకింగ్ కామెంట్లు చేశారు.
ఎన్నికల ముందు హోదా కోసం పోరాడతామంటూ చెప్పబోతున్నారని, ఆ తరహా మాటలకు ముగింపు పలికి హోదా తెచ్చేందుకు పుట్టిన పార్టీ… జై భారత్ నేషనల్ పార్టీ అని అన్నారు. ఎవరికీ తలవంచబోమని, ఎవరికీ సాష్టాంగ ప్రమాణాలు చేసేదిలేదని అన్నారు. ఎవరూ తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ ఇదని అన్నారు. అవినీతిని అంతమొందించి, ఎవరూ ఒక్క రూపాయిని కూడా తినలేని విధంగా చేసే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపిస్తామన్నారు.
మేధావులను, ఆర్థికవేత్తలను ఉక్కు పాదాల కింద తొక్కుతున్న పరిస్థితి చూస్తున్నామని, సామాజిక బాధ్యతతో సునిశిత విమర్శలు చేస్తున్నవారిని జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు, మానవ హక్కుల రక్షణ సజావుగా ఉంటే ఈ పార్టీ పుట్టేది కాదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates