కేసీయార్ చేతులెత్తేశారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీయార్ మీద తీవ్రమైన ప్రభావం చూపినట్లే ఉంది. అందుకనే తొందరలోనే జరగబోయే సింగరేణి ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ కు అనుబంధంగా సింగరేణిలో టీబీజీకేఎస్ అనే సంఘం పనిచేస్తోంది. ఇపుడు అధికారంలో ఈ యూనియనే ఉంది. ఈనెల 27వ తేదీన ఎన్నకలు జరగబోతోన్నాయి. నిజానికి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఎందుకంటే వేలాది మంది కార్మికులు, ఉద్యోగులుండే సింగరేణి ప్రాంతం నాలుగు జిల్లాల్లో విస్తరించుంది కాబట్టే.

కరీంనగర్, ఖమ్మం, ఆదిబాలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని 11 ఏరియాల్లో వేలాదిమంది పనిచేస్తున్నారు. సింగరేణి ఎన్నికలంటే సహజంగానే జనరల్ ఎలక్షన్స్ అంత భారీస్ధాయిలోనే జరుగుతుంది. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల మనోభావాల ఆధారంగానే మామూలు జనాల మూడ్ ను పార్టీలు అంచనా వేస్తుంటాయి. అందుకనే సింగరేణి ఎన్నికలకు పార్టీలు ఇంతటి ప్రాధాన్యతిస్తుంటాయి. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో పాల్గొనకూడదని కేసీయార్ డిసైడ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

ప్రస్తుతం ఈ యూనియన్ కు గౌరవాధ్యక్షురాలిగా కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత ఉన్నారు. గురువారం రాత్రి యూనియన్ నేతలతో కవిత భేటీ అయినపుడు రాబోయే ఎన్నికలకు దూరంగా ఉండాలన్న కేసీయార్ నిర్ణయాన్ని కవిత వివరించారట. దీనికి మూడునాలుగు కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే సింగరేణి ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే. కాంగ్రెస్ గెలుపులో సింగరేణి ఉద్యోగులు, కార్మికుల మద్దతు కూడా ఎక్కువగానే ఉందన్న ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు ఉందట.

అందుకనే ఇపుడు సింగరేణి ఎన్నికల్లో పోటీచేసినా టీబీజీకేఎస్ ఓడిపోతుందని అంచనా వేశారట. అదే జరిగితే పార్టీ పరువు పోవటం ఖాయమని అనుకున్నారట. ఇక రెండో కారణం ఏమిటంటే ఆర్ధిక వనరులు లేకపోవటమట. పదేళ్ళు అధికారంలో ఉండి సుమారు 900 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉన్న బీఆర్ఎస్ కు ఆర్ధిక ఇబ్బందులంటే నమ్మటం కష్టమే. ఇపుడు యూనియన్ ఎన్నికల్లో ఓడిపోతే దీని ప్రభావం తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలపైనా పడుతుందన్న భయమే కేసీయార్ ను సింగరేణి ఎన్నికల నుండి వెనక్కు లాగుతున్నట్లు అర్ధమవుతోంది.