రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమే అన్న విషయాన్ని మంత్రి రోజా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లున్నారు. అందుకనే మీడియాతో మాట్లాడుతు నగరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకేనే వాళ్ళ గెలుపుకు పనిచేస్తానని ప్రకటించారు. టికెట్ అయితే తనకే వస్తుందని తనకు కాకుండా ఎవరికిచ్చినా అభ్యంతరంలేదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో మాటలకు ఇప్పటి మాటలకు చాలా తేడావచ్చేసింది. నగరిలో తాను తప్ప ఇంకెవరు పోటీచేయరని గతంలో చెప్పేవారు.
అయితే టికెట్ల ఖరారులో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులను రోజా గమనించినట్లున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను మారుస్తున్న వైనాన్ని చూస్తున్నారు. అందుకనే తనకు కూడా మార్పు తప్పదు అన్న విషయాన్ని రోజా మానసికంగా సిద్ధపడినట్లున్నారు. అందుకనే నగరిలో టికెట్ ఎవరికిచ్చినా గెలుపుకు కష్టపడతానని చెప్పింది. నిజానికి రోజా నోరే తనకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. పైగా మొదటినుండి దూకుడు స్వభావం చాలా ఎక్కువ.
అందుకనే ప్రత్యర్ధిపార్టీలే కాదు పార్టీలోని తన ప్రత్యర్ధుల విషయంలో కూడా మంచి దూకుడుగానే ఉంటున్నారు. దాంతో రోజా వ్యవహారం నచ్చని కొందరు సీనియర్ నేతలు ఏకమయ్యారు. తన వ్యతిరేకులతో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాల్సిన మంత్రి వ్యతిరేకుల విషయంలో మరింత దూకుడుపెంచారు. దాంతో ప్రతి విషయంలోను రోజాను వ్యతిరేకించే బలమైన ప్రత్యర్ధివర్గం తయారైంది. ఒకవిధంగా ప్రత్యర్ధివర్గాన్ని రోజానే తయారుచేసుకున్నారు. ఎలాగంటే ప్రత్యర్ధివర్గంలో కీలకమైన శాంతి, కుమార్ దంపతులు, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మొదట్లో రోజాకు బాగా సన్నిహితులే.
తనకు సన్నిహితులను కూడా రోజా కష్టపడి ప్రత్యర్ధులుగా మార్చుకున్నారు. దాంతో వీళ్ళంతా కలిసి శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డితో చేతులు కలిపారు. దాంతో నియోజకవర్గంలో కీలకమైన సుమారు ఆరుగురు నేతలు రోజాకు బద్ధ వ్యతిరేకంగా జట్టుకట్టారు. రాబోయే ఎన్నికల్లో తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వాళ్ళంతా కలిసి గెలిపించుకుని వస్తామని జగన్ కే డైరెక్టుగా చెప్పారు. ఇదే సమయంలో రోజాకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కూడా చెప్పారు. దాంతో రోజాకు టికెట్ సందిగ్దంలో పడిపోయింది. అందుకనే రోజా కూడా టికెట్ రాకపోయినా పర్వాలేదని మాట్లాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates