ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 3 స్థానాలు మినహా అన్నిచోట్లా వైసీపీ విజయం దక్కించుకుంది. ఒక్కచీరాలలో టీడీపీ అప్పటి నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకిలో టీడీపీ నాయకుడు గొట్టిపాటి రవి, కొండపిలో టీడీపీ నాయకుడు డోలా బాల వీరాంజనేయస్వామి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరు మినహా అందరూ వైసీపీ నాయకులే గెలిచారు. అయితే.. టీడీపీ తరఫున గెలిచిన బలరాం కూడా తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పూర్తిగా స్థానాలు మార్చేసింది.
ఒక్కరంటే ఒక్కరిని కూడా సిట్టింగ్ స్థానంలో వైసీపీ ఉంచకపోవడం గమనార్హం. మరోవైపు ప్రస్తుత సిట్టింగుల్లో ఒకరిద్దరికి అసలు టికెట్ ఇవ్వకుండా.. వారిని పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకోనుంది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పుల ప్రకంపనలు అలజడి సృష్టిస్తున్నాయి.
ఇవీ.. మార్పులు
- యర్రగొండపాలెం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపికి మార్చారు.
- కొండపిలో వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబును బాపట్ల జిల్లా వేమూరుకు కేటాయించారు.
- వేమూరు నుంచి ఎన్నికైన మంత్రి మేరుగు నాగార్జునకు ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి పంపించారు.
- మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు, బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలను వేరే నియోజకవర్గాలకు పంపించనున్నారు.
- అదేవిధంగా కీలకమైన ఒంగోలు నియోజకవర్గంలోననూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా మార్చనున్నారు. ఈ స్థానాన్ని కరణం బలరాంకు ఇవ్వనున్నారు. ఇక, బాలినేనిని గిద్దలూరుకు పంపించనున్నారు.
- ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈ దఫా ఎమ్మెల్యేగా వెళ్లనున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
- వైసీపీ రీజినల్ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి.. బాలినేనితో భేటీ అయ్యారు. తన సీటును మార్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
మార్పులకు ఇవీ కారణాలు..
- ప్రకాశం జిల్లాలోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలతో పాటు, పార్టీలో లుకలుకలు, వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, ఒంగోలు, కనిగిరి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలొచ్చాయి.
- సంతనూతలపాడులో ఒక వర్గం బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. గిద్దలూరులో రెడ్డి సామాజిక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేపై నిప్పులు చెరుగుతున్నారు.