ఇద్దరు ముఖ్యులే. అధికారపార్టీకి చెందిన వారే. అలాంటి వారి మధ్య నెలకొన్న వర్గ పోరు ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల పట్టణ పోలీసులకు ఎదురైంది. ఒకరు ఎమ్మెల్యే అయితే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. బలంలోనూ.. బలగంలోనూ.. రచ్చలోనూ ఇద్దరు ఇద్దరే. అలాంటి ఇద్దరి మధ్య ఏ చిన్న గొడవ జరిగినా.. అది చివరకు తమ పీకలకు చుట్టుకుంటుందని తెలుసు. అందుకే.. సిత్రమైన పంచాయితీ చేసి.. వారిద్దరిని సెట్ చేశారు.
ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కరణం బలరాం గెలుపొందారు. అదే సమయంలో ఆమంచి క్రిష్ణమోహన్ ఓడారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కరణం.. అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో.. ఒకే ఒరలో రెండు కత్తులు పట్టాల్సిన పరిస్థితి. అందునా.. ఆమంచి.. కరణం లాంటి భిన్న ధ్రువాలు ఒకే పార్టీలో ఉండటంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఇటీవల కాలంలో ఇరు వర్గాలకు చెందిన వారు ఏ చిన్న అవకాశం వచ్చినా తమ అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు గొడవపటం కామన్ గా మారింది. ఈ నేపథ్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని పోటాపోటీగా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు కూడా ఎవరికి వారుగా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో.. అధికారపార్టీలో నెలకొన్న వర్గ పోరును సెట్ చేసేందుకు ఆసక్తికర ప్రతిపాదనను ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే మందు పెట్టారు.
వైఎస్ వర్థంతి కార్యక్రమాల్ని ఉదయం వేళలో ఎమ్మెల్యే కరణం వర్గీయులు జరుపుకోవాలని.. రాత్రి వేళలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఇరువురు నేతలు ఓకే చెప్పటంతో.. హమ్మయ్య అని చీరాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతున్నారు. పోలీసుల పుణ్యమా అని.. పట్టణంలో అనుకోని ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేలా చేసిన పోలీసుల తీరును ప్రజలు అభినందిస్తున్నారు.