అభ్యర్ధుల జాబితా రెడీ అయ్యిందా ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల జాబితాను జగన్మోహన్ రెడ్డి దాదాపు రెడీచేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. జిల్లాల ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లతో ఇదే విషయమై జగన్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో తెప్పించుకుంటున్న సర్వే నివేదికల ఆధారంగా ఎవరిని ఏ నియోజకవర్గంలో పోటీచేయించాలి, ఎవరిని తప్పించాలి, ఎవరిని ఎంపీ, ఎంఎల్ఏలుగా పోటీచేయించాలనే విషయమై జగన్ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. దీని ఆధారంగానే నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులు చేస్తున్నారు.

ఇలాంటి మార్పులన్నింటినీ ఈనెలాఖరుకు పూర్తిచేసేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. అంటే జగన్ ఉద్దేశ్యంలో జనవరిలోనే వీలైనంతమంది అభ్యర్ధులను ప్రకటించేయాలని. సంక్రాంతి పండుగ తర్వాత అభ్యర్ధుల ప్రకటన ఉండచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. షెడ్యూల్ కన్నా 20 రోజులు ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని మంత్రులతో జగన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎంఎల్ఏ అభ్యర్ధులతో పాటు ఎంపీ అభ్యర్ధులను కూడా జగన్ ఫైనల్ చేసేస్తున్నారట.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం ప్రతి ఉమ్మడి జిల్లాలోను కనీసం ఐదుగురు ఎంఎల్ఏలకు టికెట్లు దొరికే అవకాశాలు లేవట. అంటే సుమారుగా 60-70 మంది విషయంలో జగన్ గట్టి నిర్ణయమే తీసుకుంటున్నారు. కొందరు ఎంఎల్ఏలను నియోజకవర్గాలు మార్చటం, మరికొందరిని ఎంపీలుగా పోటీచేయించటం, మరికొందరిని పోటీనుండి తప్పించటం ఖాయమంటున్నారు. ఈ మూడు పద్దతుల్లో సుమారు 70 మంది జాబితాను జగన్ ఇప్పటికే రెడీ చేసుకున్నారట. ఇందులో భాగంగానే రాజంపేట ఎంపీ, కోఆర్డినేటర్ మిథెన్ రెడ్డి తో ఎంఎల్ఏలకు ఫోన్లు చేయించి విషయం చెప్పిస్తున్నారు.

డైరెక్టుగా తానే చెప్పాల్సిన వాళ్ళను జగన్ పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే టికెట్ దక్కదని ఫైనల్ అయిన ఎంఎల్ఏలు మళ్ళీ గట్టిగా ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు కూడా లేకపోవటమే. మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళరామకృష్ణారెడ్డి వ్యవహారాన్నే అందరు ఉదాహరణగా చూస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులైన ఎంఎల్ఏల్లో ఆళ్ళ కూడా ఒకళ్ళు. అలాంటి ఆళ్ళకే జగన్ టికెట్ ఇవ్వదలచుకోలేదంటే ఇక తమ పరిస్ధితి ఏమిటని ఎవరికి వాళ్ళుగా సమాధానాలు చెప్పుకుంటున్నారు. మొత్తంమీద కొత్త అభ్యర్ధులను వీలైనంత తొందరగా ప్రకటించేందుకు జగన్ రెడీ అవుతున్నారు.