బీజేపీ అయోమయం పెంచేస్తోందా ?

ఏపీ రాజకీయాల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీయేననే చెప్పాలి. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత ఆజ్యం పోస్తున్నారు. అయోమయానికి ఒకరకంగా కారణం కూడా పవననే చెప్పాలి. ఎలాగంటే ఎన్డీయేలో పార్టనర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. నిజానికి దీన్ని అనైతికమనే చెప్పాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతికం, అనైతికమనే ప్రస్తావన పెద్దగా ఉండటం లేదు. తమకు ఏది లాభం చేస్తోందో దాన్ని పార్టీల అధ్యక్షులు, అధినేతలు ఫాలో అయిపోతున్నారు.

ఇపుడు విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తుపెట్టుకున్న పవన్ మిత్రపక్షమైన బీజేపీతో ఒక్కసారి కూడా వేదికను పంచుకోలేదు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీతోనే కలిసి ఎన్నికలకు వెళుతున్నట్లు పవన్ చాలాసార్లు ప్రకటించారు. భవిష్యత్తుకు గ్యారంటీ అనే చంద్రబాబు హామీతో విడుదలైన పాంప్లెట్ మీద చంద్రబాబు సంతకంతో పాటు పవన్ సంతకం కూడా ఉంది. కాబట్టి టీడీపీ-జనసేన పొత్తు అధికారికమనే చెప్పాలి. మరి తన మిత్రపక్షం జనసేన చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఏమి చేయాలి ?

కలిస్తే పై రెండుపార్టీలతో కలవాలి లేకపోతే జనసేనతో విడిపోవాలి. కానీ బీజేపీ ఆపనిమాత్రం చేయటంలేదు. జనసేన తమ మిత్రపక్షమేనని, రాబోయే ఎన్నికల్లో తమ రెండుపార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని పదేపదే చెబుతోంది. ఈ విషయాన్ని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు చెప్పుంటారో లెక్కేలేదు. సడెన్ గా తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తులు పెట్టుకుని పోటీచేయటం, ఫలితాల తర్వాత విడిపోవటం కూడా అయిపోయింది.

తెలంగాణాలో జనసేనతో పొత్తు విషయంలో ఇంత క్లారిటితో ఉన్న బీజేపీ మరి ఏపీ విషయంలో మాత్రం ఎందుకు నాన్చుతోందో అర్ధంకావటంలేదు. ఇపుడు సమస్య ఏమిటంటే టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళుతుందా వెళ్ళదా అన్నది తేలటంలేదు. ఎన్నికలు మరో నాలుగు మాసాల్లోకి వచ్చేసింది. బీజేపీ ఏ సంగతి చెప్పనంతవరకు టీడీపీ, జనసేన మధ్య కూడా సీట్ల విషయంలో అయోమయం తప్పేట్లులేదు. పొత్తుల విషయంలో నరేంద్రమోడీ ఏ సంగతి చెప్పకుండా వాయిదాలు వేస్తున్నారు. అందుకనే ఏపీ రాజకీయాల్లో పొత్తులపై బీజేపీ అయోమయం పెంచేస్తోందనే అనుకోవాలి.