తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిని దక్కించుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు ఎత్తకుండానే ఆయన బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. కమ్మోళ్లు తలదించుకునేలా తాను ఎప్పటికీ ఎలాంటి పనీ చేయబోనని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాలయంలో శ్రీ సీతారామ కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కమ్మ జాతికి ఎవరి దయ దాక్షిణ్యాలు అవసరం లేదని పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కమ్మ జాతి చరిత్ర గర్వ కారణమని, పౌరుషం దాతృత్వం కలిగిన కమ్మ జాతి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. “ఈ జాతి ఎవరి ముందు తల వంచే జాతి కాదు. ఎవరి దయా దాక్షిణ్యాలపైనా బతికే జాతి అంతకన్నా కాదు. నేలను నమ్ముకున్న జాతి.. నా కమ్మ జాతి” అని తుమ్మల వ్యాఖ్యానించారు.
ఏ రంగంలో చూసినా కమ్మ జాతి ఇతర కులాల అభివృద్ధిలో పాటు పడతామని, కమ్మ కులం తల వంచే పని చేయనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో మంత్రి పదవి దక్కిందన్నారు. శ్రీ రాముడు నడయాడిన పుణ్య భూమి అభివృద్ధికి తన జీవితం అంకితం చేస్తానన్నారు. ఉగాది నాటికి రెండో వారధి పూర్తి చేస్తామన్నారు. తన రాజకీయ లక్ష్యం.. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేస్తానని మంత్రి తుమ్మల చెప్పారు.