ఎదురు దెబ్బ తగిలితే కానీ.. నొప్పి బాధ తెలియదన్నట్టుగా.. ఓటమి చవిచూస్తేనే తప్ప.. పార్టీ విలువ, నాయకుల విలువ కొందరికి అంతగా తెలియవు. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎదురైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయా రు. తాను ఓడిపోతానని కానీ.. తనను ప్రజలు ఓడగొడతారని కానీ.. జగ్గారెడ్డి అస్సలు ఊంహించలేదు. అంతేనా.. ఎన్నికలకు ముందు ఆయన సీఎం రేసులో కూడా ఉన్నానని ప్రకటించారు.
అంత ధైర్యం.. అంత సాహసం.. అంత ఫైరు.. ఒక్క ఓటమితో పటాపంచలు అయిపోయింది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు కళ్లు తెరుచుకున్నా.. రేవంత్‌రెడ్డితో కలసి పనిచేస్తా అని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన జగ్గారెడ్డి ఇలా వ్యాఖ్యానిస్తారని కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఆయన ఇలానే అన్నారు.
“నేను సంగారెడ్డి నుంచి 5 సార్లు పోటీ చేశా. 3 సార్లు ప్రజలు ఆశీర్వదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయా. ఎలా ఓడిపోయానో.. ఎందుకు ఓడిపోయానో అసలు తెల్వట్లేదు. ఈ ఓటమి నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఎంత బలవంతుడు అయినా.. ఏదో ఒకరోజు బలహీనుడు కాకతప్పదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. రానున్న ఐదేళ్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తా. నేనేంటో నాకు అర్థమైంది” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates