కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ట్రెండ్ మారినట్లే కనబడుతోంది. కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన పదేళ్ళ అసెంబ్లీ సమావేశాలకు తాజా సమావేశాలకు తేడా స్పష్టంగా కనబడుతోంది. ఎలాగంటే ఇపుడు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పూర్తిస్ధాయిలో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల సభ్యుల ప్రశ్నలకు రేవంత్ తో పాటు మంత్రులు చాలామంది సుదీర్ఘంగా సమాధానాలిచ్చారు. గతంలో కూడా కేసీయార్ తో పాటు మంత్రులు మాట్లాడేవారు. అయితే మంత్రులు మాట్లాడిన సమయం తక్కువగా ఉండేది.
అప్పట్లో మంత్రులు కూడా మాట్లాడినా కేటీయార్, హరీష్ రావుకే ఎక్కువ ప్రాధాన్యత దక్కేది. కానీ ఇపుడు అలా కాకుండా మంత్రులు సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. అలాగే ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం దొరికింది. గతంలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేవారు కానీ మాట్లాడటం మొదలుపెట్టగానే కేసీయార్ లేదా మంత్రులు లేవగానే కాంగ్రెస్ సభ్యులకు స్పీకర్ మైక్ కట్ చేసేవారు. కానీ ఇపుడు కేటీయార్, హరీష్ రావు తాము చెప్పదలచుకున్నవిషయాలను పూర్తిగా చెబుతున్నారు.
రేవంత్ ఏ విషయంపైన మాట్లాడినా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు సూచించారు. గత ప్రభుత్వంలో అంతా కేసీయార్ అన్నట్లుగా వన్ మ్యాన్ షో జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు దక్కుతున్నాయి. కాకపోతే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే కేటీయార్, హరీష్ రావే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రులు ప్రస్తావించారు. బీఆర్ఎస్ అంటే కేటీయార్, హరీష్ రావే కాదని మిగిలిన ఎంఎల్ఏలను కూడా మాట్లాడనివ్వమని చురకలు వేశారు.
అయినా కేటీయార్, హరీషే ఎక్కువగా మాట్లాడారు. ప్రతిపక్షాల సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని గతంలో కూడా కేసీయార్ చాలాసార్లు చెప్పారు. ప్రతిపక్షాల సభ్యులు ముఖ్యంగా కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఏదన్నా మాట్లాడం మొదలుపెట్టగానే కేసీయార్ జోక్యం చేసుకునే వారు. దాంతో స్పీకర్ మైక్ కట్ చేసేవారు. అంటే కేసీయార్ చెప్పిన దానికి సభలో జరిగినదానికి ఏమాత్రం సంబంధంలేదని అర్ధమైపోయింది. కానీ ఇపుడు అలాకాకుండా కేటీయార్, హరీష్ చాలాసేపే మాట్లాడారు. మొత్తానికి రేవంత్ నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాల ట్రెండ్ మారినట్లే కనబడుతోంది.