ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా కేటీయార్, హరీష్ రావులో అధికారమత్తు వదిలినట్లు లేదు. తామింకా అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చల్లో కేటీయార్ , హరీష్ మాట్లాడిన మాటలు, వాళ్ళ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యమేసింది. పదేళ్ళ కేసీయార్ పరిపాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వివిధ శాఖలు చేసిన అప్పులపై రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. దానికి కౌంటరుగా కేటీయార్, హరీష్ పదేపదే అడ్డుతగలటమే ఆశ్చర్యంగా ఉంది.
రేవంత్, మంత్రులు కేసీయార్ పదేళ్ళ పాలనలోని వైఫల్యాలను ప్రస్తావిస్తే కేటీయార్, హరీష్ మాత్రం పదేళ్ళకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కర్నాటకలో ప్రభుత్వ పాలన, ఇందిరాగాంధి హయాంలో జరిగిన విషయాలపైన ప్రస్తావించటమే విచిత్రంగా ఉంది. సంక్షేమంలో తమ ప్రభుత్వంది స్వర్ణయుగమని కేటీయార్ పదేపదే చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ వివిధ శాఖల అప్పులగురించి మాట్లాడినపుడల్లా కేటీయార్ ఆస్తుల గురించి మాట్లాడారు. పైగా రేవంత్ ప్రభుత్వం ఏర్పడి పదిరోజులు మాత్రమే అయ్యిందనే స్పృహ కూడా లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పదేపదే వాదనలకు దిగటమే విచిత్రంగా ఉంది.
ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేన తర్వాత కాస్త కుదురుకోవటానికి కనీసం మూడు, నాలుగు నెలలు పడుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ వ్యవహారాలపై మాట్లాడటం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షలు చేసి వాస్తవ పరిస్ధితులు తెలుసుకోవటం వేరు. శాఖల వారీగా లోతైన సమీక్షలు చేస్తేకానీ అసలు పరిస్ధితులు అర్ధంకావు. ఇందుకు మూడు, నాలుగు నెలలు పడుతుంది.
లోతైన సమీక్షలు చేసినపుడే విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్లు అప్పుల్లో ఉందని, పౌరసరఫరాల శాఖ రు. 54 వేల కోట్ల అప్పుల్లో ఉందని బయటపడింది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలాగుండాలో సలహా ఇవ్వాల్సిన కేటీయార్, హరీష్ కర్నాటక ప్రభుత్వం గురించి, 2014కు ముందు కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడితే ఏమిటి ఉపయోగం ? అసెంబ్లీలో వీళ్ళ మాటల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటాన్ని తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమవుతోంది. నిజంగానే కేసీయార్ పరిపాలన స్వర్ణయుగమే అయితే జనాలు ఎందుకు ఓడగొట్టారన్న విశ్లేషణ చేసుకోవాల్సింది పోయి అక్కసు వెళ్ళగక్కటమే ఆశ్చర్యంగా ఉంది.