టీడీపీ యువ నాయకుడు, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. ఈ క్రమంలో భోగాపురం సమీపంలోని పోలంపల్లిలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అదినేతపవన్ కళ్యాణ్‌ను కూడా ఆహ్వానించారు. ఆయన రాకతో ఇరు పార్టీల మధ్య మరింత బంధం బలపేతం అవుతుందని టీడీపీ నేతలు భావించారు. అయితే.. తొలుత ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని చెప్పిన పవన్.. తర్వాత.. ‘రాలేనని’ కబురు పెట్టారు.
తాజాగా ఈ విషయాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ధ్రువీకరించారు. యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదని తెలిపారు. అయితే.. ఇదేసమయంలో ఆయన రాకపోయినా.. జనసేన నుంచి ఎవరైనా వస్తున్నారా? అన్న దానికి కూడా టీడీపీ దాట వేత ధోరణినే అవలంభించింది. వాస్తవానికి తాను రాకపోయినా.. తన కార్యకర్తలో లేక ఇతర అగ్ర నాయకులనో పవన్ పంపించే అవకాశం ఉంది. కానీ, ఈ విషయంపైనా క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా నదెండ్ల మనోహర్, నాగబాబు, దుర్గేష్‌వంటి నాయకులు ఉన్నా.. వారిని పంపించేందుకు పార్టీ సుమఖుంగా లేనట్టు తెలుస్తోంది.
వాస్తవానికి యువగళం సభ ద్వారా టీడీపీ-జనసేనల మిత్రపక్ష బంధాన్ని మరింత లోతుగా ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని.. వారి కార్యాచరణను కూడా ప్రకటించాలని అనుకున్నారు. అంతేకాదు.. ఉమ్మడి మేనిఫెస్టోలోని కీలక అంశాలను ఇరు పార్టీల అగ్రనేతలు ఈ సభా వేదిక నుంచే వివరించాలని కూడా భావించారు. కానీ, అనూహ్యంగా పవన్ ఈ సభకు డుమ్మా కొట్టారు. దీనికి కారణంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. టీడీపీతో బంధాన్ని మెజారిటీ జనసేన నాయకులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో నాయకులు రాజీనామాలు చేశారు.
వీరికి సర్ది చెప్పి.. మిత్రం పక్షం ప్రాధాన్యాన్ని వివరించడంలో పవన్ పెద్దగా దృష్టి పెట్టలేదు.టీడీపీతో చెలిమిని వ్యతిరేకించే వారంతా వైసీపీ సానుభూతిపరులు, కోవర్టులుగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ-జనసేన మిత్ర పక్షంపై జనాల మాట ఎలా ఉన్నా.. జనసేనలోనే ఇంకా లుకలుకలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని శాంతపరిచి తర్వాత.. మరింత బలంగా ముందుకు సాగాలని పవన్ నిర్ణయించుకుని ఉంటారనే చర్చ సాగుతోంది. ఇక, పవన్ ఈ యువగళం సభకు రాకపోవడానికి ఇతమిత్థంగా కారణం కూడా చెప్పకపోవడంతో ఇదే కారణమై ఉంటుందనే అంచనాలు కూడా పెరుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates