టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. అనుకున్న లక్ష్యం కంటే కొద్దిగా తక్కువకే ఈ యాత్రను ముగించనున్నారు. వచ్చే ఏడాది వాస్తవ షెడ్యూల్‌కన్నా ముందుగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అదేసమయంలో నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యూహాలను కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యువగళాన్ని 3200 కిలో మీటర్లకే కుదించారు. వాస్తవానికి దీనిని 4 వేల కిలో మీటర్ల వరకు లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
ఇక, యువగళం ముగింపు వేడుకలు కొన్ని తరాల వరకు గుర్తుండిపోయేలా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభకి చంద్రబాబు సహా పలువురు ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అదేసమయంలో ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యేలా ప్లాన్ చేశారు.
ఇప్పటికే సభ నిర్వహణకు సంబంధించి 16 కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సభకి 6 లక్షలు మందికి పైగా హాజరవుతారన్న అంచనాలతో భోజన ఏర్పాట్లు, కొందరికి వసతి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక, రాష్ట్రంలో బస్సు ప్రయాణాల ద్వారా వచ్చే వారికి వైసీపీ కార్యకర్తలు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, బెంగళూరుల నుంచి కూడా మొత్తం 16 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఇప్పటికే బుక్ చేసింది.
ఆయా రైళ్లలో ఒక్కొక్క దానిలో 1500 మంది ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. వీరికి రైల్లోనే భోజన, టిఫిన్ సౌకర్యాలను కల్పించారు. మొత్తంగా చూస్తే..యువగళం పాదయాత్ర ఎంత అంబరమంటేలా సాగిందో.. ముగింపు కార్యక్రమాన్ని కూడా అంతే అంబరం అంటేలా నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేసుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates