తెలంగాణ ముఖ్యమంత్రిగా తన దైన ముద్ర వేస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న మరో నిర్ణయం కూడా అంతకంటే ఎక్కువ సంచలనంగా మారింది. ముఖ్యంగా కీలక నాయకులు, ప్రధానంగా సీఎం సహా మంత్రులు వస్తున్నారంటే.. ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండడం లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే.. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక, సామాన్య ప్రజలు ఆఫీసులకు వెళ్లే సమయంలోనో.. తమ పిల్లలను స్కూళ్లకు పంపించే సమయంలోనో సీఎం వంటి నాయకుడు బయటకు వస్తే.. ఇక, వారు ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది.
సీఎం సార్ వస్తున్నారంటూ.. గంటల కొద్దీ ట్రాఫిక్‌ను ఆపేయడం రివాజుగా మారింది. ఏపీలోనూ ఇలాంటి పరిస్తితి మరింత దారుణంగా ఉంది. పైన హెలికాప్టర్‌లో సీఎం జగన్ వెళ్తున్నా.. కింద రోడ్డుమీద జనాలను ఆపేస్తున్న పరిస్థితి తెలిసిందే. దీనివల్ల సామాన్యులు నానా తిప్పలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెండ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. తను వచ్చేసమయంలో కేవలం 5 లేదా 10 నిమిషాల ముందు మాత్రమే ట్రాఫిక్‌ను ఆపాలని సూచించారు. అంతేకాదు.. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మినహాయింపులు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు, ట్రాఫిక్ నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీసు అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులు బాటు కల్పించేందుకు వీలుగా తీసుకునే చర్యలపై పోలీసులు ఆలోచిస్తున్నారు. సీఎం కాన్వాయ్ బయల్దేరే కొద్ది సేపటి ముందు వరకు వాహనాల రాకపోకలు యథావిధిగా అనుమతించాలని భావిస్తున్నారు. ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు సీఎం సూచనలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.