ప్ర‌జావాణికి ఊహించ‌ని స్పంద‌న.. ఉద‌యం నుంచే బారులు

తెలంగాణ‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌జాభ‌వ‌న్‌(ప్ర‌గ‌తి భ‌వ‌న్‌)లో ప్ర‌తి శుక్ర‌వారం నిర్వ‌హిస్తున్న ప్ర‌వావాణి కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల‌నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ రోజు శుక్ర‌వారం కావ‌డంతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌మ త‌మ స‌మ‌స్య‌ల‌తో కూడిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌ట్టుకుని క్యూలైన్ల‌లో వేచి ఉన్నారు. గ‌త శుక్ర‌వారం .. తొలి సారి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

తొలిరోజు ఆయ‌నే స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ద‌రఖాస్తుల‌ను తీసుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఉన్న‌తాధికారుల‌ను కూడా ఈకార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం చేశారు. ఇక‌, ప్ర‌తి శుక్ర‌వారం నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జా ద‌ర్బార్ కాకుండా ప్ర‌జా వాణి పేరు పెట్టిన విష‌యం తెలిసిందే.

ధ‌ర‌ణి స‌మ‌స్య‌లు స‌హ‌.. ఉద్యోగులు, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, లారీ య‌జ‌మానులు, పింఛ‌న్ల కోసం ఎదురు చూస్తున్న‌వారు, ప్ర‌భుత్వ సాయం కోసం వేచి ఉన్న‌వారు ఇలా .. అనేక మంది శుక్ర‌వారం ఉద‌యానిక‌ల్లా ప్ర‌భాభ‌వ‌న్‌కు చేరుకున్నారు. దీంతో ర‌హ‌దారి దాదాపు రెండు కిలో మీట‌ర్ల మేర వీరితో కిక్కిరిసిపోయింది. మ‌రో వైపు.. పోలీసులు కూడా.. ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించి..ద ర‌ఖాస్తు దారుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

ఇదిలావుంటే, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి.. ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేశారు. ఈ ప్ర‌జావాణిని మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేసేందుకు.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న తీరును ప‌ర్య‌వేక్షించేందుకు.. స‌మ‌గ్ర సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా ప్ర‌తి రోజూ 30 పిర్యాదుల‌ను సీఎం నేరుగా స‌మీక్షిస్తే.. ఇంకా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.