కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.. గతంలో పీసీసీ చీఫ్‌గా కూడా పనిచేసిన సాకే శైలజానాథ్ టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన గత రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్‌గా లేరు. తనను పీసీసీ చీఫ్‌పదవి నుంచి తప్పించడం దరిమిలా.. ఆయన మౌనంగా ఉంటున్నారు. పార్టీలోనూ సీనియర్లు తన మాట వినడం లేదని, కార్యకర్తలు కూడా క్షీణించిపోయారని.. పార్టీని బాగు చేయడం తన వల్లకాదని ఆయన గతంలోనే చేతులెత్తేశారు.
పైగా రాజధానికోసం అమరావతి రైతులు ఉద్యమించినప్పుడు.. సాకే బహిరంగంగా వారికి మద్దతు తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. క్రెడిట్ టీడీపీకి వెళ్లిపోతుందని, కావాలంటే.. మీరు విడిగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. కానీ, కలిసి వచ్చే నాయకులు కానరాక.. సాకే.. తన ప్రయత్నాలు విరమించుకుని.. పార్టీ కి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే దాదాపు ఏడాదిన్నరగా ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా విజయవాడలో మూడు రోజుల సమావేశం నిర్వహించినా.. కాంగ్రెస్‌నేతల్లో సాకే మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇక, ఉమ్మడి అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం నుంచి గతంలో ఆయన 2004, 2009లో విజయం దక్కించుకున్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన గ్రాఫ్ వ్యక్తిగతంగా కూడా బాగానే ఉంది.
దీంతో ఆయనను తీసుకుంటే.. టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనన్నది టీడీపీ భావన కూడా. అయితే, ఇదే టికెట్ కోసం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత, ఎస్సీ సెల్ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజు కూడా రెడీగానే ఉన్నారు. కానీ, ఆయన పోటీ ఇచ్చినా.. గెలుపు గుర్రం ఎక్కడంపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోఆయనను అదే పదవిలో కొనసాగించి.. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రతిపాదనను పార్టీ తెరమీదికి తెచ్చింది.
ఎం.ఎస్. రాజును సానుకూలంగా ఒప్పించేందుకు కీలక నేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇది సఫలమైతే.. ఆ వెంటనే సాకేను పార్టీలోకి ఆహ్వానించి.. వెంటనే టికెట్ కూడా అనౌన్సు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కీలక నేత టీడీపీలో వస్తుండడంపై చర్చ జోరుగానే సాగుతోంది.