మంత్రుల పేషీలపై సెన్సార్

మంత్రుల పేషీల్లో తీసుకుంటున్న సిబ్బంది నియామకాలపై రేవంత్ రెడ్డి సెన్సార్ విధించినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు తీసుకున్న 11 మంది మంత్రులు తమ పేషీల్లో అవసరమైన సిబ్బందిని తీసుకుంటారు. మంత్రుల పేషీల్లో పీఎస్ లు, ఓఎస్డీలు, పీఏలు, అటెండర్లను తీసుకుంటారు. కొందరు మంత్రులైతే అదనపు పీఎస్ లను కూడా తీసుకుంటారు. మంత్రుల సంఖ్య తక్కువగాను శాఖలు ఎక్కువగాను ఉండటం వల్ల కొందరు కీలకమైన శాఖలు పొందిన మంత్రులు ఎక్కువమంది సిబ్బందిని పెట్టుకోవటం సహజమే.

అయితే మంత్రులు పెట్టుకునే సిబ్బంది విషయంలో రేవంత్ సెన్సార్ పెట్టారట. సెన్సార్ అంటే ఏమీలేదు గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసిన సిబ్బందిలో ఎవరినీ ఇపుడు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు మంత్రులుపైన, మంత్రుల సిబ్బందిపైనా చాలా ఆరోపణలున్నాయి. వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని, యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇటువంటి సమయంలో తమను తాము రక్షించుకునేందుకు మాజీ మంత్రుల దగ్గర పనిచేసిన సిబ్బంది ఇప్పటి మంత్రుల దగ్గర కూడా పనిచేసేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు.

ఈ విషయం రేవంత్ దృష్టికి వచ్చింది కాబట్టే ముందుగానే మంత్రులందరినీ హెచ్చరించినట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇపుడు మంత్రులు తీసుకోవాలని అనుకుంటున్న సిబ్బంది జాబితాలను ముఖ్యమంత్రి ఆపీసుకు ముందుగా పంపాలని చెప్పారట. ఎందుకంటే సదరు సిబ్బందిపైన ఇంటెలిజెన్స్ తో సమాచారం తెప్పించుకుని అందులో క్లీన్ చిట్ ఉన్న వాళ్ళకి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలన్నది రేవంత్ భావనగా తెలుస్తోంది.

మంత్రుల పేషీల్లోని సిబ్బంది నియామకానికి సంబంధించిన క్లియరెన్స్ బాధ్యతలను ముఖ్యమంత్రి కార్యాలయంలోని సెక్రటరీ షా నవాజ్ ఖాసి పర్యవేక్షిస్తున్నారట. సర్వీసులో ఎలాంటి అవినీతి ఆరోపణలు, మరకలు లేని వాళ్ళని మాత్రమే పేషీల్లో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులందరికీ స్పష్టంగా సూచనలు చేసిందని సమాచారం. పేషీలోని సిబ్బంది విషయంలో ఒకటికి రెండుసార్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సూచనలు రావటంతో మంత్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎంతమంది మంత్రులు రేవంత్ ఆదేశాలు, సూచనలను పాటిస్తారో చూడాల్సిందే.