విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు ఫైర్ బ్రాండ్ కేశినేని నాని వ్యవహారం సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియనే రీతిలో ఉందని టీడీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఆయన పార్టీలోనే ఉన్నా.. అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి రెండు స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతుండడమేనని చెబుతున్నారు.
కానీ, వచ్చే ఎన్నికల్లో కుటుంబానికి ఒకే సీటు, అది కూడా గెలుపు గుర్రాలకు మాత్రమే కేటాయిస్తానని చంద్రబాబు పదే పదే తేల్చేస్తున్నారు. కానీ, తన కుమార్తె, ప్రస్తుతం విజయవాడ 11 వ డివిజన్ కార్పొరేట ర్‌గా ఉన్న కేశినేని శేతకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలన్నది కేశినేని వ్యూహం. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆయన పశ్చిమ టికెట్‌ను తన కుమార్తెకు ఇవ్వాలని కోరారు.
కానీ, విజయవాడ కార్పొరేషన్ గెలిపించుకుంటే మేయర్ పీఠాన్ని ఇస్తామని.. చంద్రబాబు ఇచ్చిన హామీతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేత గెలిచినా.. పార్టీ ఓడిపోయింది. దీంతో ఆ హామీ అమలు కాలేదు. ఇక, ఇప్పుడు ఉపేక్షించి లాభం లేదని భావిస్తున్న నాని.. తనకు, తన కుమార్తెకు టికెట్ల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ లేదా.. మైలవరం టికెట్లను ఆయన ఆశిస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
మైలవరం నుంచి ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమకు, ఎంపీనానికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ టికెట్‌ను తీసుకుంటే.. ఉభయ కుశలోపరిగా పనిచక్కబెట్టుకోవచ్చని ఆయన వ్యూహంగా ఉంది. దీనికి చంద్రబాబు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలోచనలో పెట్టారు. మరోవైపు.. వైసీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక్కడ కూడా. ఇదే షరతుతో ఎంపీ ఉన్నారని..రెండు టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. అయితే, మైలవరానికి బదులు విజయవాడ పశ్చిమ లేదా తూర్పు కావాలని కోరుతున్నారట. దీంతో ఇక్కడ కూడా ఎటూ తేలకుండా పోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.