కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు..ప్రభుత్వానికి మధ్య అవసరానికి మించి సత్సంబంధాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొందరు అధికారులు అధికార పార్టీ నేతలకు ఆకుల్లో…విపక్ష పార్టీల నేతలకు కంచాల్లో వడ్డిస్తుంటారని విమర్శలు వస్తుంటాయి. అయితే, ఆయా ప్రభుత్వాలు మారగానే…సదరు ఐఏఎస్ అధికారులు కూడా వేరే రాష్ట్రాలకు బదిలీ కావడమో, కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నించడమో జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే గతంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డిని కూడా స్మితా సబర్వాల్ కలవకపోగా…నీటి పారుదల శాఖపై సీఎం జరిపిన సమీక్షకూ గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే తాను కొత్త చాలెంజ్ లకు సిద్ధమంటూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం పనులను పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి కొనసాగుతున్నారు. అయితే, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలలో అధికారులకూ వాటా ఉందని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే స్మిత సబర్వాల్ కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు డీల్ చేసిన ఐపీఎస్ అకున్ సబర్వాల్ సతీమణి స్మితా సబర్వాల్ అన్న సంగతి తెలిసిందే.
కాగా, స్మితా సబర్వాల్ స్థానంలో కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న మరో మహిళా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కొత్త తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఇప్పటికే ముగ్గురు సీపీలకు స్థానచలనం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ లను మార్చాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తన మార్క్ టీంను ఎంచుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates