2001లో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సభ జరుగుతుండగానే కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని మరీ లోపలకి చొరబడి ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వీవీఐపీలకే భద్రత కరువైన నేపథ్యంలో దేశ ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆ దుర్ఘటన జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి పార్లమెంటులో భద్రతా వైఫల్యం బయటపడింది. తాజాగా జరుగుతున్న లోక్ సభ సమావేశాల సందర్భంగా ఇద్దరు ఆగంతకులు సభలోపలికి జొరబడి టీయర్ గ్యాస్ వదిలిన వైనం దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా లోక్ సభలో చొరబడి టియర్ గ్యాస్ వదలడంతో ఎంపీలు గందరగోళానికి లోనయ్యారు. గ్యాస్ వదలిన తర్వాత ఆగంతకులు రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత భయపడి సభ నుంచి వారు బయటకు పరుగులు తీశారు. అయితే, కొందరు ఎంపీలు చాకచక్యంగా ఆ ఇద్దరినీ పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఆ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, పార్లమెంటు భద్రతా సిబ్బంది వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారని ఆరోపణలు వస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి ఇద్దరు దుండగులు దూకి స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది.
ఆ దుండగుల వద్ద ఆయుధాలు ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి సామాన్యులు ప్రవేశించడమే కష్టం అయిన నేపథ్యంలో ఇద్దరు దుండగులు టియర్ గ్యాస్ తీసుకొని ఎలా వచ్చారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రకోణంలో కూడా విచారణ చేపట్టారని తెలుస్తోంది.