జగన్ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారా ?

మొదటిజాబితాలో 11 మంది ఎంఎల్ఏలు, మంత్రులకు స్ధానచలనం కలిగించిన జగన్మోహన్ రెడ్డి రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారట. రెండో జాబితాలో మంత్రులు, ఎంఎల్ఏలు కలిసి 45 మంది దాకా ఉంటారని పార్టీవర్గాల సమాచారం. రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుండి కొత్త నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. మరి కొత్త నియోజకవర్గాల నుండే పోటీచేయిస్తారా లేకపోతే పూర్తిగా పక్కకు తప్పిస్తారా అన్నది సస్పెన్సుగా మారింది.

నియోజకవర్గాలు మార్పన్నది మంత్రులు, ఎంఎల్ఏల పనితీరు ఆధారంగానే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కూడా రెండు రకాలున్నాయి. మొదటిదేమో 2019లో గెలిచిన నియోజకవర్గాల్లో జనాల్లో వ్యతిరేకత కనబడుతుండటం. రెండో కారణం ఏమిటంటే మార్చిన నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయించటమే. ఇదే సమయంలో ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ కు కూడా కొత్త ఇన్చార్జిలతో ఫ్రెష్ లుక్ కనబడుతుందని జగన్ అనుకుంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధినేతలు ఏవేవో అంచనాలు వేసుకుని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుంటారు. అలాంటి మార్పుల్లో కొన్నిచోట్ల ఆశించిన పలితాలు రావచ్చు మరికొన్ని చోట్ల ఆశాభంగం ఎదురవచ్చు. కాకపోతే తాము గెలిచిన నియోజకవర్గాల్లో జనాల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు, మంత్రులు కొత్త నియోజకవర్గాల్లో మాత్రం జనామోదం ఎలా పొందుతారన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికీ రాబోయే ఎన్నికల్లో మాత్రమే సమాధానం దొరుకుతుంది.

మార్పులన్నది అన్నీ పార్టీల్లోను సహజంగా జరిగేదే. కాస్త అటు ఇటుగా తెలుగుదేశంపార్టీలో కూడా అధినేత చంద్రబాబు చేస్తున్నారు. సరిగా పనిచేయని నేతల స్ధానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకమిటీల పేరుతో ఇద్దరు, ముగ్గురు నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్న విషయం చూస్తున్నదే. ఇపుడు చంద్రబాబు చేస్తున్నమార్పులన్నీ నూరుశాతం ఫలితాలిస్తాయని ఎవరూ గ్యారెంటీగా చెప్పలేరు. ఈ పద్దతిలోనే పార్టీలో మార్పులకు జగన్ శ్రీకారంచుట్టింది. మరీ మార్పుల ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.