బీసీ బంధుకు బ్రేక్

గత ప్రభుత్వంలో ఎంతో వివాదాస్పదమైన పథకాల్లో ఒకటైన బీసీ బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. పథకం అమలులో వచ్చిన అనేక ఆరోపణలపై సమీక్షలు జరిపేందుకే పథకాన్ని తాత్కాలికంగా నిలిపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పథకం అమలులో వచ్చిన ఆరోపణలను సమీక్షించి, ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. సమీక్షల సందర్భంగా ఆరోపణలను, ఫీడ్ బ్యాక్ ను చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నీ కోణాల్లో రివ్యూ చేసిన తర్వాత పథకాన్ని మళ్ళీ పునరుద్దరిస్తామన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ హయాంలో బీసీ బంధుపై అనేక ఆరోపణలొచ్చాయి. బీఆర్ఎస్ ఓటమికి బీసీబంధు పథకం కూడా ఒక కారణమనే చెప్పాలి. ఎలాగంటే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు పథకం అమలులో తమిష్టం వచ్చినట్లుగానే లబ్దిదారులను ఎంపికచేశారనే ఆరోపణలు బాగా వినిపించాయి. నిజమైన అర్హులను వదిలేసి అనర్హులను లబ్దిదారులుగా ఎంపికచేసేనట్లు అప్పట్లో బాగా గోలజరిగింది. అయినా కేసీయార్, కేటీయార్ పట్టించుకోలేదు.

ఇక మంత్రులు, ఎంఎల్ఏలైతే అవినీతి, అరాచకాలతో ఆకాహమే హద్దుగా చెలరేగిపోయారు. దాంతో అప్పట్లోనే పథకం అమలుపై బాగా గొడవలయ్యాయి. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులను అడ్డంపెట్టుకుని తాము ఎంపికచేసిన వారికి పథకం లబ్దిఅందేట్లుగా చర్యలు తీసుకున్నారు. దాని ప్రభావం సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడింది. ఎన్నికల్లో అభ్యర్ధులుగా ఎంపికైన వారు, సిట్టింగ్ ఎంఎల్ఏలు ప్రచారానికి వచ్చారు. అప్పుడు వాళ్ళపైన జనాలు తమ ఆగ్రహమంతా చూపించారు. చాలా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏలను జనాలు అనేక కారణాలతో ప్రచారానికి కూడా అడుగుపెట్టనీయలేదు.

అనేక కారణాలతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు తీసుకోగానే ప్రజాదర్బార్ పేరుతో జనాలను కలవటం మొదలుపెట్టారు. రోజుకు సుమారు 4 వేలమంది రేవంత్ ను కలిసి తమ బాధలను చెప్పుకుంటున్నారు. రేవంత్ ను కలిసి బాధలను, సమస్యలను చెప్పుకుంటున్నవారిలో బీసీ బంధు గురించే ఎక్కువమందున్నారట. అందుకనే పథకం అమలును వెంటనే ఆపేయాలని రేవంత్ ఆదేశించారు. దాంతో ఉన్నతాధికారులు పథకం అమలును నిలిపేశారు. మంత్రి ఆధ్వర్యంలో ఉన్నతాదికారులు లబ్దిదారుల ఎంపికను సమీక్షంచనున్నారు. రివ్యూల తర్వాత బీసీ బంధు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.