మొదటిసారి రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్లో బాధితులు అనేక సమస్యలు చెప్పుకున్నారు. ప్రగతి భవన్లోని ముందు పోర్షన్ను ప్రజాదర్బార్ కు కేటాయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రేవంత్ శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. సుమారు 40 నిముషాల పాటు జరిగిన దర్బార్లో బాధితులు అనుకమంది తమ సమస్యలను చెప్పుకున్నారు. బాధితులు చెప్పుకున్న సమస్యల్లో, ఇచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం ధరణి పోర్టల్ గురించి కావటమే గమనార్హం.
ఇదే దరణి పోర్టల్ గురించి ఎన్నికల సమయంలో కేసీయార్ పదేపదే ప్రస్తావించిన విషయం తెలిసిందే. భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఒక అద్భుతమని కేసీయార్ చెప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను తీసేస్తే భూ యజమానులు మళ్ళీ సమస్యలతో ఇబ్బందులు పడతారంటు భయపెట్టారు కూడా. ప్రతి బహిరంగసభలోను కేసీయార్ ధరణి పోర్టల్ గురించే ఎక్కువసేపు మాట్లాడేవారు.
సీన్ కట్ చేస్తే ఇపుడు బాధితుల్లో ఎక్కువమంది ధరణి పోర్టల్ పనితీరుపైన ఫిర్యాదులు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. తమకు భూమి ఉన్నా ధరణి పోర్టల్లో నమోదుకాలేదని కొందరు, తమ భూములను ధరణిపోర్టల్లో తప్పుగా నమోదయ్యాయని, వాటిని సరిచేయించాలని మరికొందరు ఇలా రకరకాల సమస్యలు చెప్పుకున్నారు. మొత్తంమీద వచ్చిన బాధితుల్లో ఎక్కువమంది ధరణిలోని లోపాల గురించి ఏకరువు పెట్టడంతో కేసీయార్ చెప్పినవన్నీ ఎన్ని అబద్ధాలో బయటపడుతున్నాయి. దాంతో ధరణి పోర్టల్లోని డొల్లతనమంతా అందరికీ అర్ధమవుతోంది. నిజానికి గ్రామస్ధాయిలో భూయజమానులు ఈ పోర్టల్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ధరణిలో నమోదయ్యే వివరాలే ఫైనల్ అని ప్రభుత్వం చెప్పటంతో భూయజమానులు షాక్ కు గురయ్యారు. భూ వివరాలు పోర్టల్లో తప్పుగా నమోదయ్యాయని యజమానులు ఎంత మొత్తుకున్నా అధికారులు పట్టించుకోలేదు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న వివరాలకు ధరణి పోర్టల్లో వివరాలకు తేడాలున్నాయని యజమానులు ఎంతచెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదు. దానివల్ల భూవిస్తీర్ణాన్ని యజమానులు కోల్పోవాల్సొచ్చింది. ఇలాంటి అనేక కారణాలతో భూయజమానుల్లో కేసీయార్ ప్రభుత్వంపై మంట బాగా పెరిగిపోయింది. ఆ మంటను సైలెంటుగా ఎన్నికల్లో చూపించారు. కాబట్టి ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పినట్లుగా ధరణి పోర్టల్ స్ధానంలో మెరుగైన వ్యవస్ధను తెచ్చి భూయజమనాలకు న్యాయం చేస్తే బాగుంటుంది.