‘ప్ర‌జాద‌ర్భార్‌’లో మెరుపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు!

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తుల తీసుకున్న మ‌రుస‌టి రోజే.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తాన‌ని ఎల్బీ స్టేడియం వేదిక‌గా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనుకున్న విధంగానే శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ్యోతిరావు పూలే ప్ర‌జా భ‌వ‌న్‌(ప్ర‌గ‌తి భ‌వ‌న్‌)లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించారు. ఈ ద‌ర్బార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్ర‌జ‌లు అర్జీలు ప‌ట్టుకుని ఉద‌యం 6 గంట‌ల‌కే క్యూల‌లో కిక్కిరిసిపోయారు.

కాగా, ఈ ప్ర‌జాద‌ర్బార్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌బుత్వ కాన్వాయ్‌ని ప‌క్క‌న పెట్టి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రజాదర్బార్‌ మొదలైంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్, మంత్రులు స్వ‌యంగా అర్జీలు స్వీకరించారు.

మరోవైపు ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు చేరుకున్నారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌స్తున్న వారిలో విక‌లాంగులు కూడా ఉన్నార‌ని సీఎం రేవంత్‌కు స‌మాచారం రావ‌డంతో వెనువెంట‌నే.. అక్క‌డ‌.. విక‌లాంగుల కోసం.. బ్యాట‌రీ వాహ‌నాల‌ను ఏర్పాటు చేశారు. ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని.. ప్ర‌జాద‌ర్బార్‌కు స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చి.. ప‌రిష్కారాల‌తో వెళ్లేలా వ్య‌వ‌హ‌రించాల‌ని ఉన్న‌తాధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్కారం అయ్యే వాటిని అధికారులు అక్క‌డే ప‌రిష్క‌రిస్క‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.