కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. సోమవారం తెల్లవారుజామున ట్యాంక్ బండ్ పై మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. గ్యాంగ్ వార్ ను తలపించేలా చేసింది. టూవీలర్ మీద వేగంగా వెళుతున్న ముగ్గురిని.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పటమే పెద్ద తప్పుగా మారింది. అది కాస్తా పెద్ద గొడవగా మారటమే కాదు.. పలువురికి గాయాలు.. కారు తగలబడింది. పక్కనే ఉన్న బస్టాపు సైతం కాలిపోయిన ఉదంతం ఇప్పుడు పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.
పార్సిగుట్టకు చెందిన నలుగురు స్నేహితులు ఆదివారం అర్థరాత్రి వేళలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు టాటా సఫారి కారులో బయలుదేరి వెళ్లారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిమజ్జనం పూర్తి చేసి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో వారి వాహనం వెనుక నుంచి టూ వీలర్ మీద ముగ్గురు యువకులు యమా స్పీడ్ గా వెళుతున్న వైనాన్ని చూసి.. వారిని అంత వేగం ఎందుకని మందలించారు. దీంతో.. వారి మధ్య గొడవ మొదలైంది.
బైక్ మీద వెళుతున్న ముగ్గురు యువకులు.. కారులోని వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అదే సమయంలో కారు తగలబడటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో ట్యాంక్ బండ్ మీద పలువురు నిమజ్జనం చేస్తున్నారు. దీంతో.. భయంతో పరుగులు తీశారు. దాదాపు ఈ ఉదంతం అరగంట పాటు సాగినా.. పోలీసులు అక్కడకు రాకపోవటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం సినిమా షూటింగ్ ను తలపించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. కారు ఎలా తగలబడిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates