పార్టీ పరంగా చూసుకుంటే.. కాంగ్రెస్ అతి పెద్ద జాతీయ పార్టీ. పైగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికా రంలోకి రావాలని భావిస్తున్న పార్టీ కూడా. మరీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజనతో.. ఏపీలో తీవ్రంగా నష్టపోయిన పార్టీ. అయితే.. ఇప్పుడు ఇచ్చామని చెబుతున్న తెలంగాణలో పదేళ్ల తర్వాత.. పార్టీ అధికా రంలోకి వచ్చింది. ఇక్కడ రేవంత్‌ను సీఎంను కూడా చేయనుంది. అయితే.. ఈ సమయంలోనే ఏపీలోనూ విస్తరించాలనేది పార్టీ ప్రణాళిక.
ఈ ప్రణాళిక ఎలా ఉన్నా.. ఏపీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే రేవంత్‌ను కలిసేందుకు అప్పాయింట్‌మెం ట్ రెడీ చేసుకున్నారు. ఇప్పటికే రేవంత్‌తో చర్చించాల్సిన అంశాలను కూడా గిడుగు రుద్రరాజు వంటి నాయకులు రెడీ చేసుకుని ప్రిపేర్ కూడా అయ్యారు. వీటిలో ప్రధానంగా.. ప్రత్యేక హోదాకు.. రేవంత్ సహకరించాలనేది.. వారి ప్రధాన డిమాండ్. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పార్టీ పుంజుకోవాలంటే.. దీనికి మించిన బ్రహ్మాస్త్రం లేదని ఏపీ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
హోదా అంశాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు వదిలేశాయని.. దీనిని అందిపుచ్చుకుని.. ఏపీలో పుంజుకు నేందుకు బాటలు వేసుకోవచ్చని.. నాయకులు లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌పై ఒత్తిడి తేవాలనేది వారి ఉద్దేశం. ఎందుకంటే.. ఇప్పటికే.. ఏపీకి హోదా ఇవ్వడానికి వీల్లేదంటూ.. బీఆర్ ఎస్ తరఫున అప్పటి ఎంపీ కవిత.. సుప్రీంకోర్టులో కేసు వేశారు. అంతేకాదు.. పోలవరంపైనా కేసులు వేశారు. ఇవి ప్రభుత్వం తరఫునే ఆమె దాఖలు చేశారు.
దీంతో రేపు రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక.. హోదా.. పోలవరం రెండు అంశాలపైనా స్పందించాలని.. హోదాను అడ్డుకోకుండా.. చూడాలని.. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ముందుకు సాగాలనేది ఏపీ నేతల డిమాండ్. ఇక, రేవంత్ విషయానికి వస్తే.. పార్టీపరంగా చూసుకుంటే.. ఏపీలో డెవలప్ అయ్యేందుకు ఈ రెండు అంశాలు బాగానే పనిచేస్తాయి.
కానీ, తెలంగాణ రాష్ట్రపరంగా చూసుకుంటే.. అక్కడ ఆయనకు ప్రదాన చిక్కుముడిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువైపు స్పందించినా.. స్పందించకపోయినా.. ఆయనకు ఇబ్బందే కనుక.. వీటిపై నాన్చుడు ధోరణితోనే ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.