చదవటానికి కాస్త పరుషంగా అనిపించినా ఇదే వాస్తవం. ఈమాటను ఎవరో చెప్పటం కాదు స్వయంగా కారుపార్టీ నేతలే ఇపుడు చెప్పుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కల్వకుంట్ల కవిత కూడా కీలకపాత్ర పోషించిందనే చర్చ పార్టీ నేతల్లో బాగా జరుగుతోంది. కేసులు, అరెస్టు నుండి కూతురు కవితను రక్షించుకునేందుకు కేసీయార్ చేసిన ప్రయత్నాలే చివరకు పార్టీ కొంపముంచాయని నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారట. నిజానికి బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలున్నాయి. అయితే ఈ చాలా కారణాల్లో కూడా కవిత పాత్ర చాలా కీలకమని చెప్పుకుంటున్నారు.
స్కామ్ లో కవిత్ పాత్ర బయటపడేంతవరకు నరేంద్రమోడీ మీద కేసీయార్ ఎలా నోరుపారేసుకున్నారో అందరు చూసిందే. అలాంటిది స్కామ్ లో కూతురు ఇరుక్కున్నది అని తెలిసిన దగ్గర నుండి మోడీ గురించి కేసీయార్ మాట్లాడటమే మానుకున్నారు. పైగా కూతురిపైన కేసు, అరెస్టు జరగకుండా అడ్డుకునేందుకు మోడీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కేసీయార్ వైఖరితో ఆరోపణలు నిజాలే అని జనాలకు అర్ధమైపోయింది.
కూతురును రక్షించుకోవాలన్న కేసీయార్ ప్రేమ చివరకు పార్టీ గెలుపును దెబ్బ తీసిందని ఇపుడు నేతలు చెప్పుకుంటున్నారు. కవితను రక్షించుకోవాలని కేసీయార్ ఆలోచించకుండా ఉండుంటే బీజేపీపైన మునుపటిలాగే ఫైటింగ్ మోడ్ కంటిన్యు చేసుండే వారే. అప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే ఆరోపణలకు అవకాశం ఉండేది కాదని నేతలంటున్నారు. కవిత అరెస్టు జరిగుంటే దాన్ని బీఆర్ఎస్ బాగా అడ్వాంటేజ్ తీసుకునేందుకు వీలుండేదని కూడా చెబుతున్నారు. ఏదేమైనా కారుపార్టీ ఓటమిలో కవిత కూడా కీలక పాత్ర పోషించారని నేతలు చెప్పుకుంటున్నారు.