కడప జిల్లాలోని సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల టీడీపీ ఇంచార్జి… బీటెక్ రవి(రవీంద్ర నాథ్‌రెడ్డి) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్.. తనను లేపేయాలని చూసినట్టు ఆయన తెలిపారు. ఓ వారం కిందట.. బీటెక్ రవిని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పులివెందుల, రాయచోటి పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అనంతరం.. ఆయన కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి.. “సీఎం జగన్ మోహన్‌రెడ్డి నన్ను లేపేయాలని చూశాడు. పోలీసులను అడ్డంపెట్టుకొని నన్ను చంపాలని ప్రయత్నించాడు. నన్ను అరెస్ట్ చేసిన రోజున ఓ గదిలో ముసుగులు ధరించిన కొత్త వ్యక్తులు తుపాకి గురిపెట్టి అనేక ప్రశ్నలతో బెదిరించారు. పులివెందుల్లో జగన్ రెడ్డి పైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నాపై కుట్రపన్నారు” అని బీటెక్ రవిఆరోపించారు.
పోలీసుల పేరుతో ఎవరినో రంగంలోకి దింపి ఇలా బెదిరించేవారిని పులివెందుల భాషలో ఏమంటారో మీకు తెలుసని మీడియాకు చెప్పారు. నన్ను చంపి అడ్డు తొలగించుకోవాలనుకుంటే కిరాయి హంతకులను పెట్టి ఒకేసారే చంపేయండి. ఇలాంటి దిగజారుడు పనులు చేస్తే పులివెందుల ప్రజలు మిమ్మల్ని వెలివేస్తారు. అని బీటెక్ రవి హెచ్చరించారు. తనను మానసికంగా కట్టడి చేసేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు.
తన కుటుంబంలోని మహిళల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి.. అనరాని మాటలతో వేధించారని బీటెక్ రవి పేర్కొన్నారు. అయినప్పటికీ.. తాను ఎవరికీ లొంగిపోలేదని, టీడీపీ సైనికుడిగానే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా తనను శారీరకంగా లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. ఏదైనా జరిగితే వైసీపీ నాయకులు, సీఎం జగన్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి బీటెక్ రవి.. సీఎం జగన్‌పై పోటీ చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates