తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. పోలింగ్ పూర్తయిన అరగంట తర్వాత.. అనేక సర్వేలు వచ్చాయి. ఈ సర్వేలన్నీ కూడా అధికార బీఆర్ ఎస్‌కు ప్రమాద హెచ్చరికలనే హెచ్చరించాయి. తన మన అనే తేడా లేకుండా సాగిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ.. బీఆర్ ఎస్‌కు అధికారం దక్కడం కష్టమనే విషయాన్ని చాటి చెప్పాయి. అయితే.. ఒకింత ఆలస్యంగా తన ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించిన ‘ఇండియా టుడే’ కూడా.. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది.
దేశంలో ‘ఇండియా టుడే’ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇతర సంస్థల మాదిరిగా తొందరగా ఏదో చెప్పేయాలి.. సంచలనాలు సృష్టించాలి.. అనే ధోరణికి ఇండియా టుడే చాలా దూరంగా ఉంటుంది. ఈఏడాది జరిగిన కర్నాటక ఎన్నికల తర్వాత.. రెండు రోజులకు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఇతర సంస్థలన్నీ ఎన్నికల పోలింగ్ ముగియగానే వెల్లడించినా.. ఆచి తూచి వ్యవహరించే ఇండియా టుడే.. మాత్రం ఆలస్యంగా వెల్లడించడం గమనార్హం.
ఇక, ఇండియా టుడే చెప్పింది.. కర్ణాటకలో అక్షర సత్యం అయింది. ఇతర సంస్థల కంటే యాక్యురేట్‌గా ఫలితాలను వెల్లడించ డం.. ఈ సంస్థ ప్రత్యేకత. ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు వస్తాయో.. కూడా ఈ సంస్థ కర్ణాటక విషయంలో తూచ తప్పకుండా వెల్లడించడం.. అదే జరగడం గమనార్హం. ఇక, తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించి కూడా.. ఆలస్యంగా వెల్లడించినప్పటి.. తమ ఫలితాలు యాక్యురేట్‌గా ఉంటాయని సంస్ధ తెలిపింది.
ఇండియా టుడే సర్వే ఫలితాల మేరకు..
బీఆర్ ఎస్ 34-44 స్థానాల్లో గెలుపు
కాంగ్రెస్ 63-72 స్థానాల్లో విజయం
బీజేపీ 4-8 స్థానాల్లో గెలుపు
ఎంఐఎం 5-7 చోట్ల విజయం
స్వతంత్రులు 2-3 స్థానాల్లో గెలుస్తారని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఇదిలావుంటే.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెలువడనుందని ఎన్నికల సంఘం పేర్కొంది.