త‌క్ష‌ణ‌మే నీటి విడుద‌ల ఆపేయండి: ఏపీపై కృష్ణా బోర్డు ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం నాగార్జున సాగ‌ర్ నీటి విడుద‌ల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరుపై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు తీవ్రంగా స్పందించింది. ఔను.. మీది దుందుడుకే! అని వ్యాఖ్యానించింది. త‌క్ష‌ణ‌మే అక్క‌డ నుంచి బ‌ల‌గాల‌ను వెన‌క్కి మ‌ళ్లించాల‌ని.. నీటి విడుద‌ల‌ను ఆపేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఏపీఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శికి కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు తాజాగా లేఖ రాసింది.

ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు

కృష్ణాన‌ది నీటి విష‌యంలో తెలంగాణ‌-ఏపీ ప్ర‌భుత్వాల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాన్ని ఏపీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే ఉల్లంఘిస్తున్నట్టు స్ప‌ష్ట‌మైంద‌ని కృష్ణాబోర్డు వ్యాఖ్యానించింది. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిందని గుర్తు చేసింది. దీని ప్ర‌కారం.. 2024 జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 24 వరకు 5 టీఎంసీలు, అక్టోబర్ 10 నుంచి 20 వరకు 5 టీఎంసీలు నీరు విడుదలకు బోర్డు అనుమతి ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని, నవంబర్ 30 వరకు ముందు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని ఏపీని కేఆర్ఎంబీ నిల‌దీసింది.

చెప్పిన దానికంటే ఎక్కువే వాడారు..

ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌కు చెప్పిన దానికంటే.. ఒప్పందానిక‌న్నా.. కూడా ఎక్కువ నీటినే వినియోగించింద‌ని కృష్ణాబోర్డు పేర్కొంది. ఏపీకి 3 విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నామని బోర్డు తెలిపింది. అక్టోబర్‌ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్లు పేర్కొంది. 2024 జనవరి, ఏప్రిల్‌లో నీరు విడుదల చేయాల్సి ఉందని, 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేయడం సరికాదని కృష్ణా బోర్డు తెలిపింది. డ్యాం దగ్గర ఏపీ పోలీసులను మోహరించి సాగర్‌ను ఆక్రమించారని కృష్ణా బోర్డుకు తెలంగాణ అధికారులు చేసిన‌ ఫిర్యాదులో వాస్త‌వం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. త‌క్ష‌ణ‌మే బ‌ల‌గాల‌ను వెన‌క్కి మ‌ళ్లించి.. నీటి విడుద‌ల‌ను ఆపేయాల‌ని ఆదేశించింది.