ఎగ్జిట్ పోల్ నిజ‌మైతే.. దేశంలో కొత్త హిస్ట‌రీ..!

దేశంలో ఐదు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. దాదాపు మూడు మాసాల కింద‌ట ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నిక‌ల క్ర‌తువు ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చేసింది. డిసెంబ‌రు 3న ఎన్నిక‌ల ఫ‌లితం రానుంది. అయితే.. దీనికి ముందుగా.. ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఈ ఫలితాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. అందుకే..చాలా చోట్ల ఈ ఫ‌లితాల‌పై భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి. ఒక‌వేళ అభిప్రాయాల‌ను ప‌క్క‌న పెట్టి అవే క‌నుక నిజ‌మైతే.. దేశంలో కొత్త హిస్ట‌రీ క్రియేట్ అయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీలకులు.

ఎలా… ఎందుకు?
తెలంగాణ‌ను ప‌క్క‌న పెడితే.. మూడు ప్ర‌దాన రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే ఎన్నిక‌ల పోరు సాగింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల‌లో ఈ రెండు పార్టీలే పోటీ ప‌డ్డాయి. చిన్నా చిత‌కా పార్టీల‌ను ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధానంగా కాంగ్రెస్‌-బీజేపీలో ఈ మూడు రాష్ట్రాల్లో త‌ల‌ప‌డ్డాయి. అయితే.. తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క రాజ‌స్థాన్ త‌ప్ప‌.. మిగిలిన రెండు చోట్లా కాంగ్రెస్ పుంజుకుంది. అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ కూడా ఉంది.

ఇక‌, రాజ‌స్థాన్‌లోనూ అధికారం.. బీజేపీ-కాంగ్రెస్‌ల మ‌ధ్యే దోబూచులాడింది. సో.. చిన్న పాటి తేడాతో ఇక్క డ కూడా కాంగ్రెస్ గెలిచే చాన్స్ ఉంటే.. ఇక, ఇదొక అద్భుత‌మ‌నే అంటున్నారు. మ‌రోవైపు తెలంగాణ లోనూ అధికారం కాంగ్రెస్‌దేన‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఒక్క ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో మిన‌హా నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పుంజుకుంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లోనూ ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది.

అంటే.. మొత్తంగా చూస్తే. మ‌ళ్లీ కాంగ్రెస్‌కు పున‌రుజ్జీవ ఘ‌ట్టం మొద‌లైంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ నార్హం. ఇదే నిజ‌మై.. కాంగ్రెస్ క‌నుక వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి పుంజుకుంటే.. అది ఖ‌చ్చితంగా హిస్ట‌రీని సృష్టిస్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు. బ‌ల‌మైన మోడీ హ‌వాను త‌ట్టుకుని.. అనేక ప్ర‌యాస‌లు ప‌డుతున్న కాంగ్రెస్ నిల‌బ‌డిన‌ట్టేన‌ని చెబుతున్నారు. రాహుల్‌పై వేదింపులు, కేసులు.. నేష‌న‌ల్ హెరాల్డ్ 750 కోట్ల ఆస్తులు సీజ్.. పార్టీ చీలిక‌ల ప్రోత్సాహం.. వంటి అనేక ఇబ్బందుల నుంచి కాంగ్రెస్ కొత్త దిశ‌గా అడుగులు వేసే చాన్స్ ఉంద‌ని లెక్కలు వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.