తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను హాజరైన బహిరంగ సభల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యపై మాత్రం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి మోడీ నోటి నుంచి వచ్చిన ఆ మాటలో నిజం ఎంతన్న ప్రశ్నతో పాటు.. మోడీ చేసిన సదరు వ్యాఖ్యపై సీఎం కేసీఆర్ తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ మోడీ అన్న మాట ఏమంటే.. “మోడీ నీడ పడితే నీ సంపద మొత్తం పోతుందని కేసీఆర్ కు ఎవరో చెప్పారు. అందుకే నాకు ఎదురుపడటం లేదు. నేను ఎప్పుడు వచ్చినా 50 కీలోమీటర్ల దూరంలో ఉంటున్నారు” అంటూ చురకలు అంటించారు.
మోడీ మాటలకు తగ్గట్లే.. ఏదో ఒక కారణం చూపించి మోడీతో కలిసి వేదికను పంచుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అనటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన మాటలో నిజం ఎంతన్న విషయంపై గులాబీ బాస్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ను మూఢ నమ్మకాలను నమ్మే వ్యక్తిగా పంచ్ లు వేసే ప్రధాని మోడీ.. తాజా వ్యాఖ్యపై మాత్రం కేసీఆర్ స్పందించాలన్న మాట బలంగా వినిపిస్తోంది.ఒక రకంగా ఇది పబ్లిక్ డిమాండ్ అని.. మోడీ కోసం కాకున్నా.. సగటు తెలంగాణ వ్యక్తికి మోడీ చెప్పిన మాటల్లో నిజం ఎంతన్నది తెలుసుకోవాలన్న మాట వినిపిస్తోంది.