ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే.. వాస్తవానికి నిక్కచ్చిగా చెప్పాలంటే.. ఈ మిత్రపక్షానికి ఇరు పార్టీల నుంచి స్పందన పెద్దగా రావడం లేదు. క్షేత్రస్థాయిలో నాయకులు ఇప్పటికే.. వేర్వేరుగానే పోటీ ఉంటుందని.. భావించి వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నారు. కానీ, ఇంతలోనే కలిసిపోటీ అనే అంశం తెరమీదకి రావడంతో నాయకులు డోలాయమానంలో పడ్డారు.
దీంతో ఇరు పార్టీలు కలిసి తీసుకున్న సమన్వయ సమావేశాలు.. ఆదిలోనే బెడిసి కొట్టాయి. కొన్ని జిల్లాల్లో ఇరు పార్టీల నాయకులు కూడా.. బాహాబాహీకి దిగితే.. మరికొన్ని చోట్ల అసంతృప్తులు వెలుగుచూశాయి. ఇంకొన్ని చోట్ల ముఖస్తుతితో పనికానిచ్చారు. కానీ.. క్షేత్రస్తాయిలో మాత్రం చేతులు కలపలేదు. దీంతో సమన్వయ సమావేశాలు ముగిసిపోయాయి. ఇక, ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన రెండు ప్రకటనలు నాయకులను మరింత ట్విస్ట్‌కు గురి చేస్తున్నాయి.
ఒకటి.. పదేళ్ల వరకు ఏపీలో మనం మిత్రపక్షంగానే ఉందామని చెప్పడం.. రెండు.. పదువుల ఆశించవద్దు.. కేవలం వైసీపీని పారదోలడమే పనిగా క్షేత్రస్తాయిలో యుద్ధం ప్రకటించాలని విశాఖ వేదికగా ఆయన చేసిన ప్రకటనలు. ఈ రెండు ప్రకటనలు కూడా.. జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో చేసినట్టే ఏపీలోనూ చేస్తారా? అనేది నాయకుల సందేహం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. కనీసం 40 స్థానాల్లో బలమైన జనసేన నాయకులు పోటీకి రెడీ అవుతున్నారు.
కానీ.. పొత్తుల్లో భాగంగా ఇన్ని సీట్లు దక్కే చాన్స్ లేదు. పైగా ఇప్పుడు పదేళ్ల పాట మరింతగా వారిని కలవరపెడుతోంది. మరోవైపు.. పదవులు ఆశించకుండా పనిచేయాలని చెప్పడం కూడా.. నాయకులకు రుచించడం లేదు. ఇదేంటని? వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 10 ఏళ్లకుపైగా ఎదరు చూస్తున్నామని.. జెండాలు మోస్తున్నామని.. మరో పదేళ్లు వెయిట్ చేయాలా? అనివారు ప్రశ్నిస్తున్నారు. అయితే.. దీనిని ఎదుర్కొనేందుకు త్వరలోనే జనసేనాని నియోజకవర్గాల బాట పడతారని సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates