ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు ఇప్పుడు ఖరీదై పోయాయి. పైగా పోటీ కూడా పెరిగిపోయింది. దీంతో రాజకీయాల్లో నాయకులు నిలదొక్కుకోవడం కష్టతరంగా మారింది. ఇక, ఎన్నికలు అనగానే మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కోట్లకు కోట్లు కుమ్మరించాల్సి ఉంటుంది. ఏదో ప్రయాస పడి.. పోటీ చేసినా.. ఒక్క ఓటమితోనే కుప్పకూలే నాయకులు చాలా మంది ఉన్నారు. “చాలు బ్రో! చేతి చమురు వదిలిపోయింది” అనే కామెంట్లు వినిపించేవి.
కానీ, ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ.. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా.. నాలుగైదు సార్లు ఓటమి పాలైనా.. అభ్యర్థులు తమ అదృష్టాన్ని ఇంకా ఇంకా పరీక్షించుకుంటూనే ఉన్నారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి అంతులేని ఓటమిని ఎదుర్కొంటున్న నాయకులు
చాలా మంది మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందరూ.. ప్రధాన పార్టీలకు చెందిన వారే కావడం.. వరుసగా వారు ఓడిపోతున్నా.. ఆయా పార్టీలు వారికే టికెట్లు ఇస్తుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎన్నికల్లో ఏదో ఒకటి రెండు సార్లు ఓడిపోయిన నాయకులు మళ్లీ పోటీ చేశారంటే.. సరే.. అనుకోవచ్చు. కానీ, మూడు సార్లు, నాలుగు, ఐదు సార్లు ఓడిపోయిన అభ్యర్తులు కూడా మళ్లీ ఇప్పుడు పోటీలో ఉండడం.. హోరా హోరీ ప్రయత్నాలు చేయడం గమనార్హం.
ఇవీ.. ఓటమి వీరుల రికార్డులు
- వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఏకంగా నాలుగుసార్లు వరుసగా ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా పోటీలో ఉన్నారు.
- మధిర నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజ్ గత మూడు సార్లుగా గెలుపు గుర్రం ఎక్కలేక పోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా కమల్‌రాజ్ పోటీలో ఉన్నారు. అంటే ఇది నాలుగోసారి.
- మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి 2010 నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నారు. అయినా.. ఇప్పుడు మరోసారి పోటీలో ఉన్నారు.
- ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మూడుసార్లు ఓడిపోయారు. బీఆర్ ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓడిపోతున్నా.. ఇప్పుడు నాలుగోసారి కూడా బరిలో నిలిచారు.
- కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి ఇప్పటికి ఏకంగా ఐదుసార్లు ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఈయన పోటీలో ఉన్నారు. మరి ఈసారైనా గెలుస్తారో లేదో చూడాలి.
- మహ్మద్ ఫిరోజ్‌ఖాన్.. హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లూ ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు.