‘రోడ్డు కావాలా.. అయితే.. పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేయండి’

ఏపీలో వైసీపీ హ‌యాంలో అభివృద్ధి మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణ‌, బాగుజేత వంటివాటి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అస‌లు ప‌ట్టించుకోవ‌డం మానేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం నుంచి సామాజిక సాధికార యాత్ర‌ల వ‌ర‌కు కూడా.. ఎక్క‌డ క‌నిపించినా.. ప్ర‌జ‌లు ఈ విష‌యంపైనే నిల‌దీస్తున్నారు.

ఇక‌, టీడీపీ-జన‌సేన మిత్ర‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో ర‌హ‌దారుల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు కూడా తెలిపారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నిర‌స‌న మ‌రింత ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఏ మంత్రి క‌నిపించినా.. వైసీపీ ఎమ్మెల్యే క‌నిపించినా.. త‌మ‌కు ర‌హ‌దారులు ఏవ‌ని, ఉన్న‌వాటిని బాగు చేయ‌రెందక‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కొంద‌రు స‌ర్దిచెబుతున్నా.. మ‌రికొంద‌రు మాత్రం స‌హ‌నం కోల్పోతున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్ర‌జ‌ల‌పై నే ఎద‌రు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని గ్రామస్థులు విస్తుపోయారు. నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నామని వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేస్తారా? రోడ్లు వేయిస్తాన‌ని వ్యాఖ్యానించారు. దీంతో గ్రామ‌స్తులు నివ్వెర పోయారు.