“తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో వారంలో జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మీకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండిగ్ డీఏల చెల్లింపు విషయం గుర్తుకు వచ్చిందా? ఇది ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధం కాదా? దీనిని అనుమతించం” అని కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు తేల్చి చెప్పింది. తాజాగా ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. దీంతో ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాలన్న కేసీఆర్ వ్యూహాలకు ఎన్నికల సంఘం బ్రేకులు వేసినట్టయింది. ఈ ఒక్క విషయమే కాదు.. ఇతర కీలక పథకాల నిధుల బట్వాడాకు కూడా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఏం జరిగింది?
రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ డీఏను మరింత పెంచింది. దీంతో ఉద్యోగుల నుంచి డీఏ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పుడు కీలక ఎన్నికల సమయంలో ఉద్యోగులను తనవైపు మళ్లించుకునేందుకు కేసీఆర్.. బకాయిలు చెల్లించేందుకు రెడీ అయ్యారు. ఇక, సంతకమే తరువాయి అనుకున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో కోడ్ అడ్డుతగిలింది. ఇక, కాంగ్రెస్ కూడా.. ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే.. ఉద్యోగులపై కేసీఆర్ ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించింది. దీనిని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలిపింది.
అదేసమయంలో రైతు బంధు, దళిత బంధు, రైతు రుణమాఫీలను కూడా చెల్లించాలని కేసీఆర్ నిర్ణయించుకున్న వైనాన్ని కాంగ్రెస్ దుయ్యబట్టింది. అయితే.. బీఆర్ ఎస్ మాత్రం ఇవి ఎప్పటి నుంచో అమలవుతున్నపథకాలే కాబట్టి వీటికి కోడ్ అడ్డురాదని చెప్పింది. అయినా.. ఎందుకైనా మంచిదని.. కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ కంటే ముందుగానే ప్రభుత్వం లేఖ రాసింది.డీఏ బకాయిలు సహా .. ఇతర పథకాల నిధులు విడుదల చేస్తాం.. అనుమతించాలని కోరింది. దీనిని విస్తృత కోణంలో చర్చించిన ఎన్నికల సంఘం తాజాగా అలాంటివి చేయడానికి వీల్లేదని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని తేల్చి చెబుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీంతో కేసీఆర్ ఎన్నికల వ్యూహం బెడిసి కొట్టినట్టయింది.