విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక ప్రతి విషయంలోనూ కనిపిస్తుంటుంది. అటు రాజకీయ నేతలు కావొచ్చు.. సామాన్య ప్రజలు కానీ పలు అంశాల్ని తమ రాష్ట్రంతో పోల్చుకుంటుంటారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గా నడుస్తూ ఉంటుంది. తెలంగాణలో రాజకీయాలు ఏకపక్షంగా మారగా.. ఏపీలో ఇంకా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. బలమైన ప్రతిపక్షంగా బాబు అండ్ కో పోరాటం చేస్తున్నారు. వారు చేసే విమర్శలకు.. ఆరోపణలకు ప్రజల ఆమోదం ఎంతన్నది.. ఇప్పటికిప్పుడు చెప్పటం అంత సులువైన విషయం కాదు.
ఇదిలా ఉంటే.. కరోనా వేళలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల తీరుకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రావటమే ఉండదు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన ఏ రోజు ప్రగతిభవన్ లో ఉంటారో.. ఏ రోజు ఫామ్ హౌస్ లో ఉంటారన్న విషయం.. సీఎం బీటు చూసే రిపోర్టర్లకు తప్పించి.. మిగిలిన వారందరికి ఎప్పటికప్పుడు పెద్ద ఫజిలే. సీఎం బయట కనిపించరన్న కొరత లేకుండా మంత్రి కేటీఆర్ తెగ తిరిగేస్తుంటారు.
కరోనా వేళలోనూ ఆయన హాజరయ్యే కార్యక్రమాలు.. పాల్గొనే ప్రారంభోత్సవాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యమంత్రి బయటకు రారన్న కొరతను తీర్చేస్తుంటారు. కేటీఆర్ తో పోలిస్తే.. విపక్ష నేతలు పెద్దగా బయటకు రారనే చెప్పాలి. కాకుంటే.. అప్పుడప్పుడన్నా బయటకు వస్తుంటారు. అధికారపక్షానికి చెందిన హరీశ్ కావొచ్చు.. ఇతర నేతలు వస్తుంటారు. ఇక.. విపక్ష నేతలు ఫర్లేదు. అగ్ర నాయకులు అప్పుడప్పుడన్నా బయటకు వస్తుంటారు.
దీనికి పూర్తి భిన్నగా ఏపీ పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావొచ్చు.. విపక్ష నేత కమ్ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వీరెవరూ బయటకు రారు. తెలంగాణలో మాత్రం ముఖ్య నేతలంతా నిత్యం బయటకు వస్తూపోతూ ఉంటే.. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.
బయటకు రాకుండానే.. రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు ఆగ్రహంతో ఊగిపోయేలా రాజకీయాలు చేయటంలో ఏపీ అధినేతలు ముందుంటారని చెప్పాలి. ఈ విషయంలో తెలంగాణ నేతలు వెనుకబడి ఉంటారు. ఇదంతా చూసినప్పుడు.. తెలంగాణ చేసుకున్న అదృష్టం ఏమిటి? ఏపీ చేసుకున్న దురదృష్టం ఏమిటన్న సందేహం కలుగక మానదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates