కొత్త లెక్క: కాకినాడ ఎంపీ సీటు మీద మెగా అన్న చూపు?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ – జనసేన పొత్తు నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మినీ మేనిఫెస్టో మీద చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు.. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాల మీదా చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. టీడీపీ అధినేతతో పవన్ కల్యాణ్ కొన్ని సీట్లకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన నరసాపూర్ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగటం.. ఓట్ల వేటలో దారుణంగా వెనుకబడిపోవటం.. మూడో స్థానంలో నిలవటం తెలిసిందే. మొదటి స్థానంలో వైసీపీ నిలవగా.. రెండోస్థానంలో టీడీపీ నిలిచింది. మూడో స్థానంలో నాగబాబు నిలిచారు. ఈ చేదు అనుభవం నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా నరసాపురం నుంచి కాకినాడ ఎంపీ స్థానానికి మారాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. చంద్రబాబుతో దీని గురించి పవన్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండటంతో పాటు.. జనసేనకు పట్టున్న కాకినాడ నుంచి నాగబాబును బరిలోకి దించితే గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది.

2018లో మాదిరి ఒంటరిగా కాకుండా టీడీపీ మద్దతుతో బరిలోకి దిగటం ద్వారా లాభం చేకూరుతుందన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేయటం ద్వారా లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో పాటు.. మరోసారి ఓటమికి దూరంగా ఉండాలంటే కాకినాడ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుందని తేల్చారు. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సమయంలో నాగబాబు బరిలోకి దిగే కాకినాడ స్థానంలో పవన్ కల్యాణ్ ప్రచారాన్ని పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. జనసేన వర్గాల్లో వినిపిస్తున్న ఈ వాదనకు తగ్గట్లే టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన ఉంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.