2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఆ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ రెండు ఘటనలలోనూ కామన్ ఫ్యాక్టర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.
ఎందుకంటే ఆనాడు సీఎం జగన్ కు, మమతా బెనర్జీకి ఎన్నికల, రాజకీయ వ్యూహకర్తగా ఉన్నది పీకే. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలపై దాడులు జరుగుతున్న వైనం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీకే రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాలలో ఇటువంటి కుట్రలు సాధారణమని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గువ్వల బాలరాజు, ప్రభాకర్ రెడ్డిలపై దాడి ఇటువంటి కుట్రల్లో భాగమని ఆరోపించారు.
సంచలనం కోసమే ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగిందని పోలీసులు చెప్పారని, ఆ నిందితుడిని ఇంతవరకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదని రేవంత్ గుర్తు చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలని, రిమాండ్ రిపోర్ట్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇక, మరో మూడు కుట్రలు జరుగుతాయని కేసీఆర్ కూడా చెబుతున్నారని, ముందుగానే కుట్రల గురించి ఆయనకు ఎలా తెలుసు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, అయినా ఎన్నికల సంఘం మౌనంగా ఉందని ఆక్షేపించారు. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.