వచ్చే 2024 ఎన్నికల్లో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన జనసేన-టీడీపీల వ్యూహం ఫలించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేందుకు మరో పార్టీ లేకపోవడం.. రాష్ట్రంలో చర్చకు వచ్చింది. దీంతో జనసేన-టీడీపీల బంధంపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దింపేస్తామనే వాదననుజనసేన బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. ఈ విషయంలో అలెర్ట్‌గానే ఉన్నారు. ఇక, టీడీపీ కూడా .. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే.. ఖచ్చితంగా జనసేనతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న దరిమిలా.. నిన్న మొన్నటి వరకు విభేదాలతో నడిచిన రాజకీయాలు ఇప్పుడు సర్దుకుపోతున్నాయి. దీంతో కలివిడిగా.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో జనసేన అభ్యర్థులను కలుపుకొని పోతున్నారు.
ఇది మంచి సంకేతాలను ఇస్తోంది. ఇక, రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జనసేనతో కలిసి పోటీ చేసేందుకు ఇక్కడి నాయకులు కూడా రెడీగానే ఉన్నారు. తాజాగా నిర్వహించిన కొన్ని ఆన్‌లైన్ సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అభిమానులు కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక, గ్రామీణ స్థాయిలో మాత్రం.. ఇంకా పొత్తుల విషయంపై ఒక అవగాహన ఏర్పడలేదు.
కీలకమైన గ్రామీణ స్థాయిలో ఓటర్లను కూడా ఈ రెండు పార్టీలూ కదిలించే ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అసవరం ఉంది. లేకపోతే.. గ్రామీణ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, పొత్తుతో కలిసి వచ్చేందుకు కమ్యూనిస్టులు కూడా రెడీగానే ఉన్నారు. అయితే.. వీరు బీజేపీని పక్కన పెడుతున్నారు. బీజేపీ లేకుండా ఉంటే.. జనసేన-టీడీపీ-కమ్యూనిస్టులు కలిసి పోటీ చేయాలనేది వ్యూహం. మరి ఏం జరుగుతుందో చూడాలి.