కాంగ్రెస్ బీసీ మంత్రం పనిచేస్తుందా ?

Revanth Reddy

కామారెడ్డిలో నామినేషన్ వేసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీ మంత్రాన్ని ప్రయోగించారు. అదేమిటంటే అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఉన్న 24 శాతం రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతామని రేవంత్ ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉన్నట్లుగానే బీసీలకు కూడా జ్యోతిరావ్ పూలే పేరుతో సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు.

అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బీసీల సబ్ ప్లాన్ పై బిల్లు పెడతామని, ఏడాదికి రు. 20 వేల కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామని కూడా రేవంత్ ప్రకటించారు. అలాగే ఎంబీసీ(మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్) అభివృద్ధికి ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటుచేస్తామని కూడా చెప్పారు. నిజానికి ఈ డిమాండ్లన్నీ బీసీల నుండి ఎప్పటినుండో వినిపిస్తున్నదే. అయితే కేసీయార్ ఎందుకనో పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే ఎన్నికలను రేవంత్ అడ్వాంటేజ్ తీసుకున్నారు.

బీసీల ఓట్లను ఆకట్టుకోవటానికి రేవంత్ ఇంకా చాలా వరాలను, హామీలను ఇచ్చారు. వీటిల్లో ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి. అయితే ఓటర్లలో బీసీల ఓట్లు అత్యధికం అన్న విషయం తెలిసిందే. అందుకనే మొత్తం 119 సీట్లలో కనీసం సగమన్నా బీసీలకు కేటాయించాలని పార్టీలో కొంతకాలంగా డిమాండ్లు మొదలయ్యాయి. అయితే సగం కాకపోయినా కనీసం 35-40 టికెట్లు ఇస్తామని అధిష్టానం కూడా బీసీ నేతలకు హామీ ఇచ్చింది. అయితే చివరకు బీసీలకు కేటాయించిన టికెట్లు 23 మాత్రమే.

ఎందుకంటే అగ్రవర్ణాల్లోని మిగిలిన సామాజికవర్గాలకు కూడా టికెట్లు కేటాయించటం కీలకం కావటంతో ముందుగా ఇచ్చిన హామీమేరకు టికెట్లను బీసీలకు ఇవ్వలేకపోయింది. అందుకనే ఇపుడు ఇతరత్రా హామీలను రేవంత్ ప్రకటించారు. అధికారంలో వాటా, లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచటం, ప్రత్యేక మంత్రిత్వశాఖ, సబ్ ప్లాన్ ఏర్పాటు లాంటి కీలకమైన హామీలిచ్చారు. మరి రేవంత్ తాజా హామీలు, వరాల విషయంలో బీసీలు ఏ విధంగా స్పందిస్తారన్నది కీలకం. బీసీలు గనుక కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే పార్టీ గెలుపు ఈజీ అనే అనుకోవాలి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.