తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి కావొచ్చు.. లేదా బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిననాటి నుంచి కావొచ్చు.. ఇప్పటి వరకు ఆయన ఏ ఎన్నికల్లో అయినా కేవలం ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా గతంలో పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఆయన ఏదో ఒక స్థానాన్ని మాత్రమే ఎంచుకుని అక్కడ నుంచి తలపడుతున్నారు.
కానీ, తెలంగాణ ప్రస్తుత ఎన్నికల్లో గతానికి భిన్నంగా కేసీఆర్ రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు. ఒకటి తను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కాగా, రెండో తొలిసారి తలపడుతున్న కామారె డ్డి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నుంచి బలమైన నాయకులే.. కేసీఆర్‌పై తలపడుతుండడం గమనార్హం.
దీంతో కేసీఆర్ రెండు నియోకవర్గాల్లోనూ శక్తికి మించి శ్రమపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గజ్వేల్‌లో చేసిన అభివృద్ధిని చెప్పుకొంటున్నారు. 2014 నుంచి ఇక్కడ జరిగిన మంచిని, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఏకరువు పెడుతున్నారు. ఇక, కామారెడ్డిలో సెంటిమెంటును పండిస్తున్నారు. ఇది తన తల్లి జన్మస్తానమని, దీనితో తనకు పేగు బంధం ఉందని ఆయన చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు కోసం.. ఆయన క్షేత్రస్థాయి నాయకులను ఏకం చేస్తున్నారు. నిరంతరం మానిటరింగ్ కూడా చేస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున రేవంత్ పోటీ చేయడం, గజ్వేల్ నుంచి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఈటల రాజేందర్ తలపడుతుండడంతో వారి దూకుడును సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాలకు కేసీఆర్ పదును పెంచుతున్నారు. ఇద్దరూ బలమైన నాయకులు కావడంతోపాటు.. సామాజిక వర్గాల పరంగా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఈ రెండు చోట్లా చెమటోడుస్తున్నారనే చెప్పాలని అంటున్నారు బీఆర్ ఎస్ నాయకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates