తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో బీర్ఎస్ నేతలపై కాంగ్రెస నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర రావు కారణమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. గతంలో శత్రువులతో చేతులు కలిపిన ఎర్రబెల్లి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్మును ఎర్రబెల్లి అమెరికాలో పెట్టుబడిగా పెడుతున్నాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లికి బొంద పెట్టాలని ఓటర్లను, టీడీపీ కార్యకర్తలకు కూడా తాను పిలుపినిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను అంతా గమనిస్తున్నారని, ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో మాత్రమే ఐటీ దాడులు జరుగుతున్నాయని, తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates