తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటున్నానని వైఎస్ఆర్టిపి అధినేత్రి వైయస్ షర్మిల కొద్ది రోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సొంతగానే తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన షర్మిల హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలపై ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల ద్రోహి అని, ఆమెను నమ్మి మోసపోయామని సంచలన ఆరోపణలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని గౌరవించామని, ఆమెను నమ్మితే తడి గుడ్డతో గొంతులు కోశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సమాజంలో షర్మిలకు చోటు లేదని, ఆమెను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వైటీపీ తమదని, షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు సంచలన ప్రకటన చేశారు. వైటిపితో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని, అసలు ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదని ఆరోపించారు. వైటిపి షర్మిలది కాదన్నారు.
రెండు, మూడు రోజుల్లో ఇతర నేతలతో చర్చించి భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామన్నారు. తెలంగాణకు షర్మిల నాయకత్వం అవసరం లేదని, కాంగ్రెస్ మద్దతు అడగకముందే ఎందుకు మద్దతు ఇస్తామని ప్రకటించారని ప్రశ్నించారు. భవిష్యత్తులో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడించి తీరతామన్నారు. నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అని చెప్పిన షర్మిల ఈరోజు తమను నడిరోడ్డుపై నిలబెట్టారని వాపోయారు. రేవంత్ రెడ్డిని దొంగ అని ఆరోపణలు చేసిన షర్మిల కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని, ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిలతో పోలిస్తే కేఏ పాల్ చాలా నయమని సెటైర్లు వేశారు.
నమ్మి ఆమె వెంట నడిచినందుకు తమను తెలంగాణకు సమాజం క్షమించాలని గట్టు రామచంద్రరావు అన్నారు. రామచంద్రరావుతోపాటు షర్మిలపై కొందరు వైటిపి నాయకులు తిరుగుబాటు చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరి గట్టు రామచంద్రరావుతోపాటు వైటీపీ నేతల విమర్శలపై షర్మిల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.