“మేం అధికారంలోకి వస్తే.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రైతులకు ఉపయోగపడేలా.. ఈ ప్రాంతం లో ఎత్తిపోతల పథకాలను అమలు చేస్తాం. ఈ ప్రాంతంలో విద్యాలయాలను నిర్మిస్తాం. యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం”- కొంచెం వెనక్కి వెళ్లి… అప్పటి ఎన్నికలను పరిశీలిస్తే.. ఇలాంటి హామీలే దాదాపు అన్ని పార్టీల్లోనూ వినిపించేవి. ఇది సమాజోద్ధరణకు ఎంతో ఉప యోగపడేవి. అయితే, వ్యక్తిగత లబ్ధి అప్పట్లో లేదా? అంటే.. ఉండేది. కానీ, ఇప్పటి మాదిరిగా మాత్రం!
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తే.. అవి తెలంగాణ అయినా.. మరో రాష్ట్రమైనా.. అంతా పర్సన ల్ ప్రాఫిట్ గురించే చర్చ సాగుతోంది. పార్టీలు, నాయకుల నుంచి ఓటర్ల వరకు అంతా “మాకేంటి?” అనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. దీనిలో సమాజ ఉద్ధరణ, నగరాల నిర్మాణం, కొత్త విద్యాలయాల ఏర్పాటు, వైద్య శాలల ఏర్పాటు వంటివి మచ్చుకు కూడా కనిపించవు. మాకెంతిస్తారు? అని ఓటర్లు, మాకే ఓటేస్తారా? అని నాయకులు! ఇదీ.. ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నమాట. కనిపిస్తున్న వ్యవహారం.
వాస్తవానికి ఇలా వ్యక్తిగత లబ్ధి వేళ్లూనుకున్నది గత రెండు మూడు ఎన్నికల నుంచే కావడం గమనార్హం. 2004 వరకు అంతా బాగానే ఉంది. నాయకులు, పార్టీలు కూడా.. వ్యక్తిగత లబ్ధిని తగ్గించి.. సమాజ ఉద్ధరణకు అవసరమైన పథకాలను అనౌన్స్ చేసేవారు. ఇలా వచ్చినవే ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం వంటివి. కానీ, తర్వాత తర్వాత.. ఎన్నికల ముఖ చిత్రం మారిపోయి.. ఓటర్ల వ్యక్తిగతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పెరిగిపోయింది. ఎన్నికల్లో పోటీ పెరిగిపోవడమే దీనికి కారణం.
ఇక, అప్పటి నుంచి సాధారణంగా ఉన్న పింఛన్లను వేలకు వేలు పెంచడం.. అర్హత ఉన్నా లేకున్నా.. మనోళ్లయితే చాలు అన్నట్టుగా పథకాలను అమలు చేస్తామని వాగ్దానాలు ఇవ్వడం.. వ్యక్తిగత లబ్ధి కింద ప్రజాధనాన్ని మళ్లించే పథకాలను ప్రకటించడం వంటి వి పెరిగిపోయాయి. తద్వారా.. ఏం జరిగింది? అంటే.. నాయకులకు అధికారం దక్కడం మొదలైంది. కానీ, రాష్ట్రాలు అభివృద్ధి లేక సతమతం అవుతున్నాయనేది నిష్టుర సత్యం. ఈ చైతన్యం ప్రజల్లో రానంత వరకు, ఇబ్బడి ముబ్బడి ఉచితాలకు ఆశలు వదులు కోనంతవరకు కొన్ని తరాలు నష్టపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates